సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా సీమ్ బౌలర్ మహ్మద్ షమీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ ను అధిగమించాడు. తన టెస్టు కెరీర్ లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు షమీ. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను సాధించిన షమీ, ఇదే సందర్భంలో రెండు వందల వికెట్లు తీసిన భారత పేస్ బౌలర్ల జాబితాలో నిలిచాడు.
టీమిండియా తరఫున కనీసం ఈ స్థాయిలో వికెట్లను సాధించిన పేస్ బౌలర్ల సంఖ్య కూడా పరిమితంగానే ఉంది. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జవగల్ శ్రీనాథ్ ల అనంతరం టెస్టుల్లో రెండు వందల వికెట్లను తీసిన ఫాస్ట్ బౌలర్ గా షమీ నిలిచాడు. వీరిలో కపిల్ 434 వికెట్లను తీయగా, జహీర్ ఖాన్, ఇషాంత్ షమీలు చెరో 311 వికెట్లను తీశారు. జహీర్ తో రెండో స్థానాన్ని పంచుకుంటున్నాడు ఇషాంత్.
ఇక జవగల్ శ్రీనాథ్ 236 వికెట్లను సాధించాడు. కెరీర్ లో 55 వ మ్యాచ్ ఆడుతున్న షమీ రెండు వందల వికెట్ల వేటను పూర్తి చేసుకున్నాడు. ఇక షమీ దూకుడైన బౌలింగ్ ఈ మ్యాచ్ పై టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు పూర్తిగా వర్షార్ఫణం అయిన అనంతరం, మూడో రోజు ఆటలో టీమిండియా కొద్ది పరుగులను మాత్రమే జోడించి ఏడు వికెట్లను కోల్పోయింది.
టీమిండియా 327 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తర్వాత సౌతాఫ్రికా జట్టు 197 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు కీలకమైన 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆట ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగా.. వర్షం మరోసారి ఆటంకం కలిగించకపోతే.. మ్యాచ్ ఫలితం దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.