ఆశ్చర్యంగా వుంది కదూ! ఇది ఏ ముస్లిము దేశంలోనే కాదు, క్రైస్తవుల దేశమైన ఇంగ్లండులో! క్రీ.శ. 1536లో! బైబిల్‌లో వున్నదాన్ని మార్చేసి అవాచ్యాలు రాసేసినందుకు అనుకుంటారేమో, అబ్బే, హీబ్రూ భాషలోంచి ఇంగ్లీషులోకి యథాతథంగా తర్జుమా చేసినందుకు విలియం టీండెల్ అనే అతనికి శిక్ష పడింది. అంతేకాదు, బైబిల్ ప్రతులను కాథలిక్ చర్చి ఇంగ్లండు వీధుల్లో తగలబెట్టించింది. 2011 దాకా నాకీ విషయం తెలియదు. తెలిసిన సందర్భం కూడా చెప్తాను. మనందరికీ బాగా తెలిసిన ఇంగ్లీషు బైబిల్‌ను ’కింగ్ జేమ్స్ బైబిల్’ అంటారు. మొదటి జేమ్స్ అనే ఇంగ్లండు రాజు 1604లో 47 మంది పండితుల చేత బైబిల్ ఇంగ్లీషు అనువాద ప్రక్రియను మొదలుపెట్టించాడు. అది 1611కి పూర్తయి అచ్చు ప్రతుల ద్వారా జనసామాన్యంలోకి వచ్చింది. మనకు వినబడే అనేక బైబిల్ సూక్తులు, భావవ్యక్తీకరణలు ఆ వెర్షన్‌లోనివే! అదే ప్రామాణికం అయింది.
అది వెలువడి దానికి 400 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘‘ఫ్రంట్‌లైన్’’ పత్రికలో డేవిడ్ ఎడ్గార్ అనే ఆయన ‘‘ద బైబిల్స్ జెనెసిస్’’ అనే వ్యాసం రాశాడు. దానిలో జేమ్స్ వెర్షన్ చాలా భాగం (80%ట) టీండెల్ వెర్షన్‌పై ఆధారపడిందని చెపుతూ విలియం టీండెల్ విషాదగాథ రాశాడు. అతని గురించి మరింత లోతుగా చదివినపుడు 8వ హెన్రీ విడాకుల చరిత్ర గురించి కూడా తెలియవచ్చింది. పాఠకుల ఆసక్తి ఏ మేరకు వుంటుందో తెలియకపోయినా దీని గురించి కాస్తయినా చెప్పాలనిపించింది. దీనికి ముందు నేను పదేపదే చెప్పే విషయం గుర్తు చేస్తున్నాను. మతమనేది వ్యక్తిగతస్థాయిలో వున్నంతవరకు మంచిది. కానీ ఎప్పుడైతే వ్యవస్థీకృతమైందో అనేక అవలక్షణాలు సంతరించుకుంటుంది. మతాధికారులు ఆడంబరం, అహంకారం పెంచుకుని, దేవుడి పేరుతో యితరులను శాసించడం మొదలుపెడతారు. తమ అధికారం నిలుపుకోవడానికి అనువుగా వున్న అనేక ఆచారాలు చొప్పిస్తారు. మూలసిద్ధాంతం యిది కదా, మీరిలా చెప్తున్నారేమిటి అని ఎవరైనా నిజమైన భక్తులు అడిగితే రాజుతో చెప్పి వారిని దండింపచేస్తారు.
కాథలిక్, ప్రొటెస్టెంటు వివాదం గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదివే వుంటాం. క్రైస్తవం వృద్ధి చెందాక, వారికి జగద్గురువుగా రోమ్‌లో పోప్ వ్యవస్థ ఏర్పడ్డాక, రోమన్ కాథలిక్కుల అధికారానికి అదుపు లేకపోయింది. మతానికి తోడు ధనం చేకూరింది, రాజులను శాసించే హక్కూ వచ్చి చేరింది. యూరోప్‌లోని రాజులందరూ వారి ఆదేశాలకు లోబడి పని చేయవలసి వచ్చేది. పోప్‌ల ఆడంబరాన్ని నిరసిస్తూ అసలైన క్రైస్తవం యిది కాదంటూ మార్టిన్ లూథర్ అనే జర్మన్ క్రైస్తవ సన్యాసి (1483-1546) అవలంబించిన మార్గాన్ని ప్రొటెస్టంట్ విధానం అన్నారు. ఆ పంథాకు అతని పేరు మీదుగా లూథరనిజం అనే పేరు వచ్చింది. అధికారంలో వున్నవాళ్లు తిరుగుబాటుదారులను అణచివేస్తారు కదా. అదే యిక్కడా జరిగింది. ఇక అప్పణ్నుంచి కాథలిక్కులకు, ప్రొటెస్టంట్లకు భీకరంగా పోరు జరిగింది.
మతసహనం అనేది ఎల్లవేళలా, అన్ని ప్రాంతాల్లో ఒకలా లేదు. హిందువుల్లో కూడా శైవం, వైష్ణవం మధ్య దారుణమైన పోరాటాలు జరిగాయి. ముస్లిముల్లో షియా, సున్నీల మధ్య యిప్పటికీ జరుగుతున్నాయి. పొరుగువాణ్ని ప్రేమించమని చెప్పే క్రైస్తవంలోనూ అంతే! ప్రొటెస్టంట్లను సజీవదహనాలు చేశారు. యూరోప్ రాజుల్లో కొందరు పోప్‌కు విధేయులు కాగా, మరి కొందరు ప్రొటెస్టంట్ మార్గాన్ని ఆశ్రయించారు. దీనిలో మతపరమైన విశ్వాసానికి తోడు సొంత రాజకీయ ప్రయోజనాలు కూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలో టీండెల్ పడిన కష్టాలను అర్థం చేసుకోవాలి.
హంగూ, ఆర్భాటం, అధికారం పెరిగిన కొద్దీ మతగ్రంథాలను సామాన్యులకు అందకుండా చేసి, తాము చెప్పినదే ప్రామాణికమని బుకాయించేందుకు మతగురువులు ప్రయత్నిస్తారు. వేదాలు అందరూ చదవకూడదని మన దేశంలో కూడా చాలా తరాల పాటు నిషేధం వుందని యిక్కడ గుర్తు చేసుకోవాలి. ఇంగ్లండులో అప్పట్లో అదే పరిస్థితి. బైబిల్ హీబ్రూ భాషలో ఉండేది. ఇంగ్లీషులోకి అనువదితం కాలేదు కాబట్టి చదువు వచ్చినవారికి కూడా బైబిల్‌లో ఏముందో తెలియదు. అందువలన చర్చి గురువు ఏదో ఒకటి హీబ్రూలో వల్లించేసి, నువ్వు నాకు యింత డబ్బివ్వాలి అనో నేను చెప్పిన శిక్ష అనుభవించాలి అనో అనేసేవాడు. ఓ సినిమాలో ఎల్బీ శ్రీరామ్ వేసిన హాస్యపాత్ర ప్రతిదానికీ ‘వేదాలు ఒప్పుకోవు’ అంటూ వుంటుంది. ఇప్పటికైనా సంస్కృతంలా ధ్వనించే ఏదో ఒకటి వల్లించేసి, ఋగ్వేదం యిలా చెప్తోంది అంటోంది అంటే కామోసు అనుకుంటాం. నిజం తెలుసుకోవాలంటే యిప్పుడు ఋగ్వేదం తెలుగులో దొరుకుతోంది కాబట్టి సాధ్యపడుతుంది. అప్పట్లో ఇంగ్లండులో యీ సౌకర్యం లేదు.
సామాన్యులకు సైతం దైవవాక్యం చేరాలనే లక్ష్యంతో, విశ్వాసం రీత్యా ప్రొటెస్టంట్ ఐన విలియం టీండెల్ (1494-1536) అనే బహుభాషావేత్త, యీ పనికి పూనుకుని, హీబ్రూ ఒరిజినల్స్ చదవసాగాడు. అంతటితో ఆగకుండా చర్చి గురువులను ‘మీరు చెప్పే అవాకులుచెవాకులకు బైబిల్‌లో ఆధారం కనబడటం లేదే’ అనసాగాడు. దాంతో చర్చికి మండింది. ఇతన్ని వేధించి వెంటాడింది. నిజానికి బైబిల్‌లోని కొన్ని భాగాలను 7వ శతాబ్దం నుంచి, అంటే సంస్కరణోద్యమానికి ముందే, ఇంగ్లీషులోకి అనువదించే కార్యక్రమం ప్రారంభమైంది. అవి మౌఖికంగానే ప్రాచుర్యంలో వుండేవి. రకరకాలైన అనువాదాలను క్రోడీకరించి, లాటిన్ నుంచి కొన్ని స్వయంగా తర్జుమా చేసి, జాన్ వైక్లిఫ్ అనే ఆయన 1382లో వైక్లిఫ్స్ బైబిల్ అనే పేరుతో రాతపూర్వకంగా ప్రవేశపెట్టాడు. చర్చి దీనిపై కన్నెర్ర చేసింది. ఆ రాతప్రతి ఎవరింట్లోనైనా వుంటే వారికి మరణశిక్షే అని ప్రకటించింది. రాజు దాన్ని అమలు చేసేవాడు. యూరోప్‌లోని యితర భాషల్లో అనువాదాలు వెలువడినా అక్కడ యీ శిక్ష లేదు.
టీండెల్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో తన 18వ ఏట 1512లో బిఏ చేశాడు. 1515లో ఎమ్మే చేశాడు. మాతృభాష ఇంగ్లీషుతో బాటు ఫ్రెంచ్, గ్రీక్, హీబ్రూ, జర్మన్, ఇటాలియన్, లాటిన్, స్పానిష్ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. వేదాంతశాస్త్రాన్ని బోధించేవాడు. అతని బోధనలు కాథలిక్ చర్చికి బోధనలకు విరుద్ధంగా వుండడంతో ఎవరు పడితే వాళ్లు థియాలజీని బోధించడానికి వీల్లేదని చర్చి ఆంక్షలు పెట్టింది, యితన్ని పిలిపించి చివాట్లు పెట్టింది. ఈలోగా 1516లో ఎరాస్మస్ అనే అతను బైబిల్‌ను గ్రీకులోకి అనువదించాడు. దానికి సహాయసహకారా లందించిన బిషప్ టన్‌స్టాల్ వద్దకు టీండెల్ వెళ్లి, తను ఇంగ్లీషులోకి అనువదిస్తానన్నాడు. అయితే బిషప్ వీలుపడదనేశాడు. అప్పుడొక లండన్ బట్టల వ్యాపారి యితనికి ఆశ్రయమిచ్చాడు. బైబిల్ మూలగ్రంథంలోని విషయాలివి అంటూ టీండెల్ ఉపన్యాసాలిస్తూండేవాడు. ఇంతలో మార్టిన్ లూథర్ చేసిన జర్మన్ అనువాదం 1522లో వెలువడింది.
అదిచ్చిన స్ఫూర్తితో ఎవరి సహకారమూ లేకుండానే టీండెల్ సొంతంగా అనువదించడానికి పూనుకున్నాడు. హీబ్రూ, గ్రీక్ బైబిళ్లను దగ్గర పెట్టుకుని ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు. ప్రింటింగు ప్రక్రియ ప్రాచుర్యం పొందుతూండడంతో వీటిని అధ్యాయాలుగా అచ్చు వేసి ప్రతులను జనాలకు అందించసాగాడు. పాఠకులు దీన్ని ఆదరించసాగారు. టీండెల్ దీనితో బాటు యితర పుస్తకాలు కూడా రాశాడు. అతను రాసిన ‘‘ద ఒబీడియన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ మాన్’’ అనే పుస్తకం అప్పటి ఇంగ్లండు రాజు 8వ హెన్రీ దృష్టిని ఆకర్షించింది. అతను సమర్థుడైన పాలకుడే కానీ, బహు క్రూరుడు. అప్పటికే వ్యక్తిగత కారణాలతో వాటికన్ అధికారం నుంచి బయటపడదామని చూస్తున్నాడు. ప్రతీ దేశానికి చర్చి వున్నట్లే ఇంగ్లండుకి కూడా చర్చి ఆఫ్ ఇంగ్లండు వుండేది. ఏ దేశంలో వున్నా అవి ఆ దేశపు రాజు అధీనంలో కాకుండా పోప్ అధీనంలో వుండేవి. టీండెల్ తన పుస్తకంలో ఏ దేశపు చర్చి ఆ దేశపు రాజు అధీనంలో వుండాలి తప్ప పోప్ అధీనంలో వుండకూడదని చేసిన వాదన అతనికి నచ్చింది.
పైగా మతాధికారుల ఆధిపత్యానికి బదులుగా రాజుల ఆధిపత్యం వుండాలని నమ్మిన టీండెల్ రాజదూషణ చేస్తే దైవదూషణతో సమానమని తన పుస్తకాల్లో రాయడం అతన్ని మెప్పించింది. కానీ చర్చి మాత్రం టీండెల్‌పై పగబట్టింది. చర్చి అమోదం పొందని బైబిలు అనువాదాలను ఇంగ్లండులో నడిరోడ్డులో కుప్పలుగా పోసి తగలబెడుతున్నారు కాబట్టి, యూరోప్‌లోని తక్కిన దేశాల్లో యింతటి ఆంక్షలు లేవు కాబట్టి, టీండెల్ 1524లో జర్మనీలోని హేంబర్గ్‌కు పారిపోయాడు. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఐదు భాగాలు అప్పటికే పూర్తయ్యాయి కాబట్టి, న్యూ టెస్ట్‌మెంట్ అనువాదం మొదలుపెట్టి 1525కి పూర్తి చేశాడు. కానీ జర్మనీలో కూడా ప్రొటెస్టెంటు వ్యతిరేకులు పుంజుకోవడంతో అవరోధాలు కలిగాయి.
ఓ ఏడాది గడిచేసరికి బెల్జియంలోని ఏంట్‌వెర్ప్ లూథరన్‌లకు అనుకూలమైన సిటీగా మారడంతో టీండెల్ అక్కడకు మకాం మార్చాడు. అక్కడ తన పుస్తకాలు అచ్చు వేయించి, ఇంగ్లండులోకి, స్కాట్లండ్‌లోకి స్మగుల్ చేయించేవాడు. అవి జనాలు దొంగతనంగా చదివేవారు. 1526లో దాన్ని బిషప్ టన్‌స్టల్ వాటిని నిషేధించాడు. అవి అమ్మినవాళ్లను, కొన్నవాళ్లను శిక్షిస్తానని హెచ్చరికలు జారీ చేశాడు. దొరికిన పుస్తకాలను తగలబెట్టించాడు. ఈ దహనకాండ తటస్థ క్రైస్తవుల మనసులను కష్టపెట్టినా రాజభయం చేత నోరెత్తగలిగేవారు కాదు. కార్డినల్ థామస్ వోల్సే 1529లో టీండెల్‌ను మతవిరోధిగా న్యాయస్థానంలో ప్రకటించాడు.
ఇలాటి పరిస్థితుల్లో టీండెల్ తను నమ్మినది పైకి ప్రకటించి రాజుతో వైరం తెచ్చుకున్నాడు. ఆ కథ చెప్పాలంటే , ట్యూడర్ వంశస్తుడైన 8వ హెన్రీ (1491-1547) భార్యల గురించి చెప్పాల్సి వస్తుంది. టవర్ ఆఫ్ లండన్‌లో 8వ హెన్రీ తన భార్యల తలలు నరికించిన చోటు యిదే అని చూపిస్తారు. మొత్తం ఆరుగురు భార్యల్లో యిద్దరి తలలు నరికించాడతను. నరికినప్పుడు నొప్పి కలగకుండా తలగడ పెట్టించాడు అంటూ ఒక శిల్పం వుంటుందక్కడ. మొదటి భార్య కేథరిన్‌కు అతను విడాకులు యివ్వడానికి నిశ్చయించుకున్నపుడు చర్చి అనుమతి యివ్వలేదు. అదీ అతనికి కోపం. రాజు పెళ్లి చేసుకోవాలన్నా, విడాకులు యివ్వాలన్నా చర్చి అనుమతి లేనిదే కుదిరేది కాదు ఆ రోజుల్లో.
అతని మొదటి భార్య కేథరిన్ ఆఫ్ ఆరగాన్ స్పెయిన్ రాజుగారి కుమార్తె. ఆమెకు మూడేళ్ల వయసుండగా హెన్రీ అన్నగారు ఆర్థర్‌తో వివాహం నిశ్చయించారు. 16 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన 5 నెలలకే ఆర్థర్ చచ్చిపోయాడు. కట్నం వెనక్కి యివ్వడానికి యిష్టపడని 7వ హెన్రీ ‘కావాలంటే మా రెండో అబ్బాయికి చేసుకుంటా’ అన్నాడు. అందువలన 1507లో తన కంటె ఐదేళ్లు చిన్నవాడైన 8వ హెన్రీని పెళ్లి చేసుకుంది. ఇంకో రెండేళ్లకు హెన్రీ రాజయ్యాడు. వాళ్లకి ఆరుగురు పిల్లలు పుట్టారు కానీ అందరూ చిన్న వయసులోనే చచ్చిపోయారు. మేరీ అనే ఒక్క కూతురు మాత్రమే బతికింది. తనకు వారసుడిగా కొడుకు పుట్టాలని హెన్రీ కోరిక. 11వ శతాబ్దంలో మాటిల్డా అనే యువరాణి బ్రిటిషు రాణి అయినప్పుడు, ఆమె సార్వభౌమత్వాన్ని అంగీకరించని సామంతులు అంతర్యుద్ధం జరిపి దేశాన్ని అల్లకల్లోలం చేశారు. తన కూతురు గద్దె కెక్కినా అదే పరిస్థితి వస్తుందని హెన్రీ భయం.
అందుకని ఎలాగైనా కొడుకు పుట్టాలి. 1525 వచ్చేసరికి హెన్రీ వయసు 34. అతని భార్య వయసు 39. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందుకని 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత, ఆ వివాహాన్ని రద్దు చేసి, ఏనె బొలైన్ అనే తన ప్రేయసిని పెళ్లాడదామని అనుకున్నాడు. కానీ చర్చి అడ్డుపడడంతో తమాయించుకున్నాడు. 1527 కల్లా దృఢనిశ్చయానికి వచ్చాడు. చర్చిని ఒప్పించడానికి రకరకాల బైబిళ్లను వెతికించి, దానిలో ఉన్న ఒక సూక్తి ప్రకారం కేథరిన్‌తో తన వివాహమే శాస్త్రవిరుద్ధం కాబట్టి దాన్ని రద్దు చేయడం సమంజసమని వాదించసాగాడు. లెవిటికస్ అనే అధ్యాయంలో ‘‘సోదరుడి భార్యతో కూడడం పాపం. అలా కూడితే వాళ్లకు పిల్లలు పుట్టరు.’’ అనే సూక్తి వుంది. అది చూపిస్తే ‘మీకు అమ్మాయి పుట్టిందిగా’ అంటారని హెన్రీ హీబ్రూ ఒరిజినల్‌లో ‘…కొడుకులు పుట్టరు’ అని రాసుందని వాదించాడు. నిజానికి కొడుకులు కూడా పుట్టారు, బతకలేదంతే!
బైబిల్‌లోనే డ్యూటెరొనమీ అనే మరో అధ్యాయంలో ‘ఉమ్మడి కుటుంబంలో ఎవరైనా చనిపోతే, అతని భార్య బయటివారిని కాకుండా, భర్త సోదరుణ్నే పెళ్లాడాలి.’ అని వుంది. ఆ ప్రకారమైతే హెన్రీ-కేథరిన్‌ల వివాహం ధర్మసమ్మతమే. కానీ హెన్రీ యీ సూక్తిని పట్టించుకోదలచలేదు. కేథరిన్ ‘నేను నీ అన్నతో శయనించనే లేదు. నీ వద్దకు వచ్చినపుడు నేను కన్యనే. కాబట్టి నీకు మాత్రమే భార్యను, నీ సోదరుడికి కాదు.’ అని వాదించింది. కానీ హెన్రీ అవేమీ వినదలచుకోలేదు. బైబిల్ సూక్తులకు విరుద్ధమైన మా వివాహానికి అనుమతి యివ్వడం చర్చి చేసిన తప్పు. ఇప్పుడు దాన్ని రద్దు చేయడం ద్వారా ఆ తప్పును సరిదిద్దుకున్నట్లు అవుతుందని మొండిగా వాదించాడు. కానీ చర్చి ఒప్పుకోలేదు. చర్చికి విరుద్ధంగా మాట్లాడుతూ, ఒరిజినల్ పుస్తకాలు చూపిస్తూ, సహేతుకంగా సవాలు చేస్తున్న టీండెల్ అయినా తన పక్షాన మాట్లాడుతాడేమో అనుకున్న హెన్రీకి అతను ఆశాభంగం కలిగించాడు.
1530లో రాజు విడాకులు యివ్వడం తప్పు బైబిల్‌కు విరుద్ధమనీ, కార్డినల్ వోల్సీ తప్పుడు సలహాలిచ్చి, కావాలని రాజును చర్చితో కలహానికి ప్రేరేపించాడని ‘‘ప్రాక్టీస్ ఆఫ్ ప్రిలేట్స్’’ అనే పుస్తకంలో ప్రకటించి టీండెల్ రాజాగ్రహానికి గురయ్యాడు. దాంతో భగ్గుమన్న హెన్రీ ఏంట్‌వెర్ప్‌లో టీండెల్‌కు ఆశ్రయం యిచ్చిన బెల్జియం రాజైన ఐదవ ఛార్లెస్‌కు ఉత్తరం రాసి, తమ దేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం టీండెల్‌ను బంధించి, తనకు అప్పగించాలని కోరాడు. సాక్ష్యాధారాలు లేనిదే బంధించడం కుదరదని ఛార్లెస్ జవాబిచ్చాడు. టీండెల్ ఏంట్‌వెర్ప్‌లో కొందరు ఇంగ్లీషు వ్యాపారస్తుల ఆశ్రయంలో భద్రంగా బతకుతూ తన అనువాదాల పని కొనసాగించాడు.
అయితే హోలీ రోమన్ ఎంపైర్‌కు విధేయులైన అధికారుల ద్వారా, హెన్రీ ఫిలిప్స్ అనే ఇంగ్లీషతని నమ్మకద్రోహం ద్వారా అతన్ని ఏంట్‌వెర్ప్ నుంచి బయటకు రప్పించారు. ఛార్లెస్ కాథలిక్ కాబట్టి చర్చి అతనిపై ఒత్తిడి తెచ్చింది. బ్రస్సెల్స్ బయట వున్న విల్వూర్డ్ కోటలో 1535లో బందీ చేశారు. 1536లో విచారణ జరిపారు. థామెస్ క్రామ్‌వెల్ టీండెల్ పక్షాన ప్రయత్నించినా లాభం లేకపోయింది. అందరూ నమ్మే మతవిశ్వాసాలకు విరుద్ధమైన భావాలు కలిగి వున్నాడన్న నేరంపై (అవును, ఆ రోజుల్లో అది పెద్ద నేరమే) అతన్ని ఉరి తీశారు. ఆ పై అతని శరీరాన్ని ఆ ఉరిస్తంభంపైనే దగ్ధం చేశారు. చనిపోతూ అతను ‘‘దేవుడా, ఇంగ్లండు రాజు కళ్లు తెరిపించు’’ అని ప్రార్థించాడు.
నిజానికి అతను రాజభక్తుడు. అయినా హెన్రీ అతనిపై పగబట్టడానికి కారణమేమిటంటే – రాజు చేసిన పని మతగ్రంథాలకు అనుగుణంగా లేదు అని తాను నమ్మి, బహిరంగంగా ప్రకటించడమే! బతికి వుండగా టీండెల్‌కు గౌరవం దక్కకపోయినా కింగ్ జేమ్స్ బైబిల్ తయారయ్యేటప్పుడు అతన్ని పండితులు సంభావించారు. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో 76%, న్యూ టెస్ట్‌మెంట్‌లో 83% టీండెల్ బైబిల్ లోంచే తీసుకున్నారు. అది జనసామాన్యానికి వెళ్లింది. టీండెల్ కలగన్నట్లు సాధారణ ప్రజలకు కూడా అసలైన దైవవాక్యం తెలిసింది.
ఇంతకీ హెన్రీ గొడవ ఏమైంది అనే కుతూహలం వున్నవారి కోసం ముక్తాయింపుగా – తన వివాహం శాస్త్రవిరుద్ధం కాబట్టి, రద్దు చేయడం సబబే అని అతను తనంతట తనే ప్రకటించి 1533 మేలో రద్దు చేసేసుకుని, ఐదు రోజుల తర్వాత ఏనెను పెళ్లాడాడు. అడ్డు చెప్పిన చర్చిని చీల్చి తన మాట వినే చర్చి ఆఫ్ ఇంగ్లండును 1534లో నెలకొల్పాడు. కానీ మూడేళ్లు గడిచినా ఏనె వలన కూడా కొడుకు పుట్టకపోవడంతో వ్యభిచారానికి పాల్పడిందని ఆమెపై నేరం మోపి, ఖైదు చేయించి, 1536లో విడాకులు యిచ్చిన రెండు రోజుల తర్వాత లండన్ టవర్‌లో శిరచ్ఛేదం చేయించాడు. రెండు వారాలు తిరక్కుండా జేన్ అనే ప్రేయసిని పెళ్లాడాడు. ఆమెతో 16 నెలల కాపురం. కొడుకు పుట్టాడు. కానీ ప్రసవంలో జేన్ మరణించింది.
1547లో హెన్రీ పోయాక ఆ కొడుకు ఆరవ ఎడ్వర్డ్ పేరుతో గద్దె కెక్కి ఆరేళ్లపాటు పాలించాడు. పదహారేళ్లకే అనారోగ్యంతో మరణించాడు. మార్క్‌ట్వేన్ 1881లో రాసిన ‘‘ద ప్రిన్స్ అండ్ ద పాపర్’’ (తెలుగులో రాజూపేద పేరుతో పుస్తకంగా, సినిమాగా వచ్చింది) యితని చుట్టూ అల్లిన ఫిక్షనే! ఒకే పోలికతో వున్న యువరాజు ఎడ్వర్డ్, పేదవాడు టామ్ ఒకరి స్థానంలోకి మరొకరు వస్తారు. కొన్ని నెలల తర్వాత యథాస్థానానికి చేరతారు. దీని ఆధారంగా యిప్పటికీ సినిమాలు వస్తూనే వున్నాయి.
హెన్రీ విషయానికి వస్తే ప్రియమైన భార్య జేన్ మరణం తర్వాత 26 నెలలు ఆగి ఏనె ఆఫ్ క్లీవ్స్ అనే ఆమెను పెళ్లాడాడు. ఆరు నెలల తర్వాత వివాహం రద్దు చేసుకున్నాడు. మూడు వారాల తర్వాత ఐదవ భార్యగా కేథరిన్ హోవర్డ్ అనే ఆమెను పెళ్లాడి 18 నెలలు కాపురం చేశాడు. 1542లో శిరచ్ఛేదం చేయించాడు. 16 నెలల తర్వాత కేథరిన్ పార్ అనే ఆమెను పెళ్లాడాడు. 42 నెలల కాపురం తర్వాత 1547లో 56 వ యేట తనే పోయాడు. అతను పోయాక అతని భార్య తన సవతి జేన్ యొక్క సోదరుడు (తనకూ సోదరుడి వరసే అవుతాడు) థామస్‌ను సేమూర్‌ను పెళ్లాడింది. కానీ మరుసటి ఏడాదే పోయింది. హెన్రీ భార్యల గురించి ఇంగ్లీషులో ఓ గేయం వుంది. వీలైతే చదవండి.(ఫోటో – టీండెల్, 8వ హెన్రీ, టవర్ ఆఫ్ లండన్‌లో రాణుల వధ్యస్థలం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)