తన ప్రియతమ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి క్విడ్ ప్రో కో కేసుల్లో బెయిల్ ను రద్దు చేయించాలని అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ విషయంలో ఈయన కష్టానికి వేరే ఉపోద్ఘాతం చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటికే సీబీఐ కోర్టు రఘురామకృష్ణంరాజు పిటిషన్ ను తిరస్కరించింది. సహేతుక కారణాలు లేకుండా జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయలేమని సీబీఐ కోర్టు ఆయనకు స్పష్టం చేసింది. కానీ, విశ్రమించని రఘురామ ఈ వ్యవహారంపై హై కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హై కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా, ఇప్పుడు తీర్పు రిజర్వ్ అయ్యింది.
అయితే వాదోపవాదాల సందర్భంగా మాత్రం రఘురామ న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలపై, ఓవరాల్ గా ఈ పిటిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. మాత్రం రఘురామకు ఇంకోసారి ఆశాభంగం ఎదురవుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి!
మీ రాజకీయాలకు హైకోర్టును వేదికగా చేయొద్దు.. అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారనే వైనం, రఘురామ ఈ కేసులో ఇక సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిందేనేమో అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంది. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేసుల్లోని సాక్షులను ప్రభావితం చేశారనేందుకు రుజువులను చూపించాలని న్యాయస్థానం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.
ఈ అంశంపై స్పందిస్తూ.. ఏపీ డీజీపీ, ఐపీఎస్ లకు జగన్ మోహన్ రెడ్డి బాస్ గా ఉన్నారని, ఇలా పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారట. ఇదంతా రఘురామకృష్ణంరాజు యూట్యూబ్ చానళ్లో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ, కోర్టుల్లో ఈ వాదనలు ఎంత వరకూ నిలబడతాయనేది ప్రశ్నార్థకమే. పొంతన లేని వాదనలు వద్దని న్యాయస్థానం చెప్పినా, పదే పదే ఇలాంటి వాదనలే వినిపించడంతో ఒక దశలో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
రాజకీయాలకు కోర్టును వేదికగా చేయొద్దని, ఇక ఈ వ్యవహారంలో సీబీఐ వాదనను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. జగన్ మోహన్ రెడ్డి బెదిరిస్తున్నట్టుగా సాక్షులు ఎవ్వరూ తమకు ఫిర్యాదు చేయలేదని సీబీఐ కూడా స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో తీర్పు రిజర్వ్ అయినట్టుగా తెలుస్తోంది.