మళ్లీ మొదలు.. టాలీవుడ్ లో ఒమిక్రాన్ భయాలు

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోయిందనుకున్న దశలో ఇప్పుడిప్పుడే ధైర్యంగా కొన్ని సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ కూడా అధికారికంగా ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ జాడ మొదలైంది,…

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోయిందనుకున్న దశలో ఇప్పుడిప్పుడే ధైర్యంగా కొన్ని సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ కూడా అధికారికంగా ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ జాడ మొదలైంది, బెంగళూరులో ఒమిక్రాన్ కేసులతో మూడో ముప్పు భయాలు పట్టుకున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు మరోసారి అలర్ట్ అయ్యాయి. మరిప్పుడు సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి..? మరోసారి బాక్సాఫీస్ పై కరోనా మేఘం కమ్ముకుంటుందా?

కరోనా కేసుల పెరుగుదల మొదలైతే మొదటి వేటు స్కూళ్లు, సినిమా థియేటర్లపైనే పడుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే గడిచిన 2 అనుభవాల్లో జరిగింది ఇదే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు స్కూల్స్ మూతపడుతున్నాయి. ప్రాధమిక తరగతులకు భౌతికంగా క్లాసులు పెడదామనుకున్న పాఠశాలలన్నీ తిరిగి ఆన్ లైన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుతానికి స్కూల్స్ వరకు వచ్చిన ఒమిక్రాన్ ప్రభావం, రేపోమాపో థియేటర్లపై కూడా పడే సూచనలున్నాయి.

ఉన్నఫలంగా థియేటర్లు మూసేయకపోయినా, మరోసారి 50శాతం ఆక్యుపెన్సీ లాంటి నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిస్థితి తీవ్రత దృష్ట్యా సినిమా హాళ్లు మూసేసే నిర్ణయం తీసుకుంటారు. ఎన్నిరోజులైనా వేచి చూస్తాం, థియేటర్లోకే వస్తామని చెప్పుకుంటున్నారు కొంతమంది సినీ జనాలు. 

థర్డ్ వేవ్ మొదలైతే ఆ హీరోయిజం దేనికీ పనికిరాదు. అది మొదలై, పీక్ స్టేజ్ కి వెళ్లి, క్రమంగా తగ్గి.. అన్నీ సర్దుకున్న తర్వాత సినిమాలు విడుదల చేయాలంటే కచ్చితంగా 6 నెలలకు పైగా వేచి చూడాల్సిందే. ఇప్పటికే రెండు దెబ్బలు తిన్న ఇండస్ట్రీకి మూడో దెబ్బ అంటే కోలుకోవడం కష్టమే.

డేట్స్ వచ్చేశాయి.. సినిమాలు వస్తాయా..?

ఇప్పటికే రిలీజ్ డేట్స్ విషయంలో అనేక తర్జన భర్జనలు పడి ఓ ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ఇప్పుడు మళ్లీ వాయిదా వేసుకోవాలంటే మళ్లీ పెద్ద చర్చ జరగాల్సిందే. పోనీ వాయిదా తర్వాతైనా పరిస్థితి అనుకూలిస్తుందా అంటే అదీ లేదు. 

ఇప్పటికే పెద్ద హీరోలంతా గ్యాప్ లేక కొట్టుకుంటున్నారు. థర్డ్ వేవ్ తర్వాత అంటే.. కచ్చితంగా ఒకే హీరో రెండు సినిమాలను రెడీ చేసి సిద్ధంగా ఉంటారు. అప్పుడు కాంపిటీషన్ మరింత పెరుగుతుంది కానీ తగ్గదు. అందుకే అందరికంటే ఎక్కువగా లాక్ డౌన్ అనే పదానికి సినీ ఇండస్ట్రీ భయపడుతోంది.

ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సాధారణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. వంద శాతం ఆక్యుపెన్సీ నడుస్తోంది. కొంతమంది మాస్కుల్లేకుండానే థియేటర్లలో అడుగుపెడుతున్నాడు. శానిటైజర్ అనే పదాన్నే మరిచిపోయారు మరికొంతమంది. పరిస్థితి ఇలానే కొనసాగితే.. చేజేతులా మరోసారి థియేటర్లు మూసుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.