ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిన్ననే గట్టిగా ప్రవచించారు. ప్రజాస్వామ్యానికి సంబంధించి కొత్త కొత్త విలువలను మోడీ చెబుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి.. ఒకే సారి ఎన్నికలు, ఒకే శాసన వ్యవస్థ.. ఇలా అనమాట. అయితే బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యం అంటే ఒకే పార్టీ కూడా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది.
ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో ప్రజలు తమకు అధికారం ఇవ్వకపోయినా.. అక్కడ సంకీర్ణ ప్రభుత్వాలను, ఒకే పార్టీ ప్రభుత్వాలను కూల్చి మరీ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రజాస్వామ్యం అంటే ఒకే పార్టీ అధికారంలో ఉండటం.. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా ఎమ్మెల్యేలను తిప్పుకుని తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రజాస్వామ్యం అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంది.
గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈ తరహా ప్రజాస్వామ్యాన్నే బీజేపీ వర్ధిల్లింపజేస్తోంది. ఈ క్రమంలో మరో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోందట. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఈ సారి మహారాష్ట్ర వంతు.
మహారాష్ట్రలో ప్రజలు అధికారం ఇవ్వకపోయినా బీజేపీ ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భంగపడింది. గంటల వ్యవధిలోనే ఆ ప్రభుత్వం పడిపోయింది. ఈ క్రమంలో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందక్కడ. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉన్నట్టుగా బీజేపీ నేతలు ప్రకటనలు చేసు కుంటున్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారట. ఈ విషయాన్ని బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ప్రకటించుకున్న వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వాన్ని పడేయడం అంటే.. సింపుల్ గా ఎమ్మెల్యేలను కొనడం, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడం. ఆ పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు కాషాయ తీర్థం ఇవ్వడం.. మినహా మరో మార్గం లేదు.
అయితే బీజేపీ దృష్టిలో ఇదంతా ప్రజాస్వామ్యమే. వేరే పార్టీల తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని ప్రభుత్వాలను కూల్చడం, తమ ప్రభుత్వాలను ఏర్పరచడం.. కమలం పార్టీకి తెలిసిన ప్రజాస్వామ్యం. చేసేవేమో ఈ పనులు.. మరోవైపేమో బీజేపీ ముఖ్య నేత, ప్రధానమంత్రి నరేంద్రమోడీనేమో.. ప్రజాస్వామ్యానికి రోజుకో నిర్వచనం ఇస్తుంటారు. కొత్త కొత్త సిద్ధాంతాలు చెబుతుంటారు!