జాతీయ జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్న కేరళ ఆటగాడు సంజూ సామ్సన్ కు ఐపీఎల్ లో మాత్రం అదృష్టం గట్టిగా పట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న సంజూను ఆ జట్టు ఇప్పుడు రీటెయిన్ చేసుకుంటున్న జాబితాలో మొదటి స్థానం దక్కింది.
అది కూడా భారీ మొత్తం రేటుకు కావడం గమనార్హం. ఏకంగా ఏడాదికి 14 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తో సంజూ సామ్సన్ ను ఆర్ఆర్ జట్టు అట్టి పెట్టుకుంటోందని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో చెబుతోంది. ఆటగాళ్ల భారీ వేలం ప్రక్రియకు ముందు నలుగురు ప్లేయర్లను మాత్రమే ఆయా జట్లు తమ వద్దే పెట్టుకునే అవకాశాలున్నాయి. ఈ విషయంలో ఆర్ఆర్ జట్టు ముందుగా సంజూకు ప్రాధాన్యతను ఇచ్చింది.
ఈ కాంట్రాక్ట్ లో విశేషం ఏమిటంటే..ఆర్ఆర్ జట్టు గతంలో వేలంలో సంజూ సామ్సన్ ను ఎనిమిది కోట్ల రూపాయల వ్యయానికే కొనుక్కొంది. వేలంలో ఈ కేరళ ఆటగాడి రేటు ఎనిమిది కోట్లు పలకగా, ఇప్పుడు 14 కోట్ల రూపాయల వ్యయానికి కాంట్రాక్టు లభించడం విశేషం. 27 యేళ్ల వయసున్న సంజూ సామ్సన్ ఆర్ఆర్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
టీ20ల విషయంలో ఇతడికి జాతీయ జట్టు తరఫున కూడా పలు అవకాశాలు లభించాయి. అయితే ఊహించిన రీతిలో ఆడి, ఆ అవకాశాలను నిలుపుకోలేకపోయాడు సామ్సన్. ఇటీవల న్యూజిలాండ్ తో స్వదేశంలో టీ20ల్లో సంజూ చోటును కోల్పోయాడు. అయితే ఐపీఎల్ కాంట్రాక్ట్ విషయంలో ఆ ప్రభావం ఏమీ పడలేదు.
ఇక సంజూతో పాటు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్, ఆ దేశానికే చెందిన బౌలర్ ఆర్చర్, యశస్వి జైశ్వాల్ లను కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు అట్టే పెట్టుకోవచ్చని ఈఎస్పీఎన్ పేర్కొంది.