ప్రభాస్ ప్రచారానికొస్తే ఇగోలు దెబ్బతింటాయా?

తమ సినిమాల ప్రచారం కోసం ఎవరెవరో ప్రభాస్ ను వాడుకుంటున్నారు. ప్రభాస్ కనిపిస్తే చాలు మూవీకి హైప్ వస్తోంది. రిజల్ట్ సంగతి తర్వాత. అలాంటిది ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసిన…

తమ సినిమాల ప్రచారం కోసం ఎవరెవరో ప్రభాస్ ను వాడుకుంటున్నారు. ప్రభాస్ కనిపిస్తే చాలు మూవీకి హైప్ వస్తోంది. రిజల్ట్ సంగతి తర్వాత. అలాంటిది ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసిన రాజమౌళి ఎందుకు ప్రభాస్ ను వాడుకోవడం లేదు? ఆర్ఆర్ఆర్ ప్రచారం కోసం ఎందుకు బాహుబలిని రంగంలోకి దించడం లేదు? దీనిపై రాజమౌళి దగ్గర సెపరేట్ స్కెచ్ ఏమైనా ఉందా? లేక ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయని సైలెంట్ గా ఉన్నాడా?

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇప్పటికే ప్రమోషన్ అదిరిపోతోంది. రిలీజ్ టైమ్ కి ఇది పీక్స్ కి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో మిగతా పెద్దలు కూడా ఆర్ఆర్ఆర్ కి ఉచిత ప్రమోషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. 

ఇలాంటి టైమ్ లో, ఆర్ఆర్ఆర్ కి ప్రభాస్ ప్రమోషన్ మొదలు పెడితే ఎలా ఉంటుంది? బాహుబలి క్రేజ్ కూడా ఆర్ఆర్ఆర్ కి తోడైతే సినిమాపై బజ్ పాన్ ఇండియా లెవల్లో మారుమోగిపోతుంది కదా. కానీ ఇక్కడే రాజమౌళి సంశయిస్తున్నాడు. ప్రభాస్ విషయంలో వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

బాహుబలి క్రేజ్ ని ఆర్ఆర్ఆర్ కోసం వాడుకోవాలంటే ప్రభాస్ ని కూడా రంగంలోకి దింపాల్సిందే. దానికి డార్లింగ్ ఎప్పుడైనా రెడీ. తనని పాన్ ఇండియా స్టార్ ని చేసిన రాజమౌళి కోసం ఆమాత్రం గురుదక్షిణ ఇవ్వకుండా ఉండడు ప్రభాస్. 

కానీ సమస్యంతా ఇద్దరు హీరోలతోనే. వారి ఇగోలు తేడా కొడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే రాజమౌళి సైలెంట్ గా ఉన్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఈమధ్య ఎన్టీఆర్ నిర్వహించిన ఓ టాక్ షో కోసం ప్రభాస్ ను అడిగితే అతడు నిరాకరించినట్టు వార్తలు కూడా వచ్చాయి.

ఇటీవల పూరీ జగన్నాథ్ తనయుడు సినిమా కోసం ప్రభాస్ బాగానే హడావిడి చేశాడు. కానీ అది మిస్ ఫైర్ అయింది. అదేమీ పెద్ద నెగెటివ్ సెంటిమెంట్ కాదనుకోండి. ఎందుకంటే, గతంలో ఇదే ప్రభాస్ జాతిరత్నాలకు ప్రచారం చేస్తే, అది డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. సో.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి ప్రభాస్ ని పిలిస్తే బాగానే ఉంటుంది కానీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిప్రాయం కూడా కనుక్కోవాలని అనుకుంటున్నాడట రాజమౌళి.

ఒకప్పుడు చిన్న హీరోల సినిమాలకు పెద్ద హీరోలు వచ్చి హడావుడి చేసేవారు. కానీ ఈమధ్య పెద్ద హీరోల సినిమాలకు కూడా పెద్ద హీరోలొస్తున్నారు. ఆమధ్య ఎన్టీఆర్ సినిమా ప్రచారానికి మహేష్ వస్తే, ఈమధ్య రవితేజ సినిమా కోసం పవన్ కల్యాణ్ వచ్చాడు. అంతెందుకు.. ఎన్టీఆర్-పవన్ కూడా ఓ ఓపెనింగ్ లో కనిపించారు. కాబట్టి ఎన్టీఆర్-చరణ్ సినిమా కోసం ప్రభాస్ ను తీసుకురావడంలో తప్పులేదు. ఎవ్వరి ఇగోలు హర్ట్ అవ్వవు.

కాకపోతే మంచి టైమ్ కోసం రాజమౌళి వెయిట్ చేస్తున్నాడంతే. నిజంగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం ప్రభాస్ ను వాడుకోవాలని నిర్ణయించినట్టయితే, ఈపాటికే జక్కన్న మైండ్ లో ఏదో స్కెచ్ రెడీ అయ్యే ఉంటుంది. బహుశా అది సరిగ్గా విడుదలకు ముందు ప్రభాస్-చరణ్-తారక్ తో ఓ ఇంటర్వ్యూ అయి ఉండొచ్చు.