సీఎం సాఫ్ట్ అయ్యార‌నుకుంటున్నారా…అబ్బే!

త‌న తండ్రి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త రెండురోజులుగా కేసీఆర్ త‌న పాత‌రోజుల్ని గుర్తు చేసేలా ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇక‌పై తానే నేరుగా రంగంలోకి దిగుతున్నాన‌ని,…

త‌న తండ్రి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త రెండురోజులుగా కేసీఆర్ త‌న పాత‌రోజుల్ని గుర్తు చేసేలా ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇక‌పై తానే నేరుగా రంగంలోకి దిగుతున్నాన‌ని, బీజేపీ అంతు చూసే వ‌రకూ విడిచిపెట్ట‌న‌ని కేసీఆర్ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో కేటీఆర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

కామారెడ్డి జిల్లాలో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ కీల‌క ప్ర‌సంగం చేశారు. ముఖ్య మంత్రి అయ్యాక కేసీఆర్‌ సాఫ్ట్‌ అయ్యారనుకుంటున్నారా? లోపల ఒరిజినల్‌ అలాగే ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వెకిలి మాటాలు మాట్లాడేవాళ్లు ఎక్కువైండ్రు అన్నారు. 

కేసీఆర్‌ మీద మాట్లాడితే ఊరుకోం అని హెచ్చ‌రించారు. ఏప్రిల్‌ 27కి టీఆర్ఎస్‌కి ఏళ్లు నిండినయన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడం ఎంతో క‌ష్ట‌మ‌న్నారు. ఉద్యమానికి గులాబీ జెండా మోసినప్పుడు అప్పటి ప్రభుత్వం 370 మంది పిల్లల్ని కాల్చి చంపిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా కేసీఆర్‌ ఉన్నాడ‌న్నారు. ఒక్కొక్క అడుగువేస్తూ ఆనాడే ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చింది నిజామాబాద్‌ జిల్లా అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్ అని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. 50,60 ఏండ్లు రాజకీయం చేసిన షబ్బీర్‌ అలీకి సిగ్గు, ఎగ్గూ ఏమీ లేవ‌న్నారు. కేసీఆర్‌ ఆశీస్సులతో కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తాయ‌న్నారు.  

బండి సంజ‌య్‌ని నా కొడ‌కా ఆరు ముక్క‌లుగా న‌రుకుతా అని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్  సాప్ట్ అనే మాట ప్ర‌స్తావించార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న‌ను ప్ర‌త్య‌ర్థులు కూడా దూషిస్తే తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌రోసారి ర‌గిలించ‌వ‌చ్చ‌నే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ దూష‌ణ‌ల‌కు దిగార‌ని బీజేపీ భావిస్తోంది.