ఆ బ్ర‌ద‌ర్స్ బీఆర్ఎస్ బాట‌నా..?

జేసీ బ్ర‌ద‌ర్స్ త‌మ గురించి తాము ముద్దుగా రౌడీ బ్ర‌ద‌ర్స్ అంటూ చెప్పుకుంటుంటారు. తాడిప‌త్రిలో త‌మ‌కు మించిన రౌడీలు ఎవ‌రు లేర‌ని వారే చాలా సార్లు మీడియా ముందు చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్…

జేసీ బ్ర‌ద‌ర్స్ త‌మ గురించి తాము ముద్దుగా రౌడీ బ్ర‌ద‌ర్స్ అంటూ చెప్పుకుంటుంటారు. తాడిప‌త్రిలో త‌మ‌కు మించిన రౌడీలు ఎవ‌రు లేర‌ని వారే చాలా సార్లు మీడియా ముందు చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ స‌మాధైన‌ త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు పంచన చేరి ఎమ్మెల్యే, ఎంపీ అయిన ఈ బ్ర‌ద‌ర్స్ గ‌త ఎన్నిక‌ల్లో వారసుల‌ను రంగంలోకి దింపి.. ఘోర పరాభ‌వం చెంద‌డంతో నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు అధికార పార్టీ వారిని తిడుతూ రాజ‌కీయం చేస్తున్నారు. 

మున్సిపల్ ఎన్నిక‌ల్లో స‌రికొత్త డ్రామాతో ఎమ్మెల్యే స్థాయి నుండి వార్డు మెంబర్ గా పొటీ చేసి గ‌ట్టెక్కిన‌ త‌ర్వాత మున్సిపల్ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకుని సినిమా వాళ్ళు కూడా న‌టించలేని స్థాయి న‌ట‌న‌తో డ్రామాల‌కు తెర‌లేపుతూ నిత్యం ఎల్లో మీడియాకి ప‌సందైన విందు ఇస్తూ వస్తున్నా జేసీ బ్ర‌ద‌ర్స్ చూపు ఎల్లో పార్టీ వైపు నుండి గులాబీ పార్టీ వైపు మ‌ళ్లిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఎంత సేపూ మీడియా పులిలాగా ఉంటున్నారు త‌ప్ప ప్ర‌జ‌ల కోసం పోరాటాలు చేయ‌డం లేద‌ని, పార్టీ అధినాయ‌క‌త్వం అదేశాలు లెక్క చేయ‌క‌పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి సీటు వ‌స్తుందా రాదా అనే సందేహంతో ప‌క్క చూపులు చూస్తున్నారని టాక్!

సమైక్య ఆంధ్ర ఉద్య‌మంలో ఆంధ్ర‌లోని అన్ని రాజ‌కీయ పార్టీలు స‌మైక్యం కోసం పొరాడుతూంటే రాయ‌ల తెలంగాణ అంటూ పాట పాడిన‌ జేసీ ఒక‌రు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ట‌చ్ లో వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భార్య ఒక పార్టీ, భ‌ర్త వేరో పార్టీ… తండ్రి ఒక పార్టీ అయితే… కొడుకు వేరే పార్టీలో ఉండ‌టం రొటీనే. అలాగే ఇప్పుడు కూడా జేసీ బ్ర‌ద‌ర్స్ లో ఒక‌రు ఒక పార్టీ మ‌రొక‌రు ఇంకో పార్టీ అలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

త‌మ సంస్ధ‌ల‌పై, త‌మ‌పై న‌మెదైన ఈడీ, సీబీఐ కేసుల నుండి విముక్తి కోసం… కేసీఆర్ పార్టీ కంటే ముందుగా బీజేపీ వైపు ప్ర‌య‌త్నాలు చేసిన వారి నుండి స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాల‌కు ఎటువంటి అడ్డు రాకుండా ఉండాలంటే కేసీఆర్ పార్టీనే మంచిద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను కానీ, కేసీఆర్ పార్టీని కానీ టీడీపీ, వైసీపీ ఎవ‌రు కూడా విమ‌ర్శించరు. అందుకోస‌మే టీడీపీలో ఒక కాలు, బీఆర్ఎస్ లో ఒక కాలు వేయ‌డం మంచిద‌ని అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌తో పాటు, అల్లుడుకి ఎమ్మెల్యే సీట్ల‌ బేరం కోసం జేసీ బ్ర‌ద‌ర్స్ స‌రికొత్త డ్రామా ఆడుతున్నారంటున్నారు టీడీపీలోని వ్య‌తిరేక వ‌ర్గం. అంతోఇంతో కార్య‌క‌ర్త‌లు ఉన్న తెలుగుదేశంతోనే గెల‌వని వారు ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను తిట్టిన గులాబీ పార్టీతో విజ‌యం ఎలా సాధ్యం అవుతుందంటున్నారు జేసీ అభిమానులు కూడా!