అరివీర భయంకర టీ20 బ్యాట్స్ మెన్లు.. ప్రపంచంలోనే ప్రస్తుత అత్యుత్తమ క్రికెట్ జట్టు.. పరమ పేలవమైన ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి ఎగ్జిట్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. లీగ్ దశ నుంచి డైరెక్టుగా సెమిస్ కు చేరే ఫార్మాట్ లో సాగుతున్న ఈ ప్రపంచకప్ లో భారత జట్టు తన తొలి రెండు మ్యాచ్ లలో ఓటమితో ఇంటి ముఖం పట్టడం దాదాపు ఖరారు అయినట్టే. ఇక టీమిండియా చేయగలిగిందల్లా.. చిన్నా చితక జట్లపై భారీ విజయాలను నమోదు చేసి, అభిమానులను కాస్తైనా ఊరడించడం.
ఇండియా తన తదుపరి మ్యాచ్ లను స్కాట్ లాండ్, నమీబియా, ఆఫ్ఘాన్ లపై ఆడనుంది. ఈ మ్యాచ్ లలో మరీ సంచలనాలు ఏమీ నమోదు కాకపోతే.. ఇండియా విజయాలు ఖరారే అనుకోవాలి. అయితే ఈ గెలిచేదేదో మంచి నెట్ రన్ రేట్ ను మెయింటెయిన్ చేస్తూ మూడు మ్యాచ్ లలోనూ గెలిస్తే, అప్పుడు ఇండియాకు కొద్ది మేర అవకాశాలు మిగిలి ఉన్నట్టే!
అయితే అది ఇతర జట్ల మ్యాచ్ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకే ఒక మ్యాచ్ ఇప్పుడు ఇండియా అవకాశాలను శాసిస్తుంది. అదే న్యూజిలాండ్- ఆఫ్ఘాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఇందులో గనుక ఆఫ్ఘానిస్తాన్ నెగ్గితే, భారత జట్టుకు సెమిస్ ఆశలు మిగిలి ఉన్నట్టే!
ఇప్పటి వరకూ ఈ గ్రూప్ లో పాకిస్తాన్ మూడు మ్యాచ్ లలో నెగ్గి సెమిస్ కు దాదాపు చేరింది. ఇక న్యూజిలాండ్ ఒక విజయంతో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ రెండు విజయాలతో రెండో ప్లేస్ లో ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆఫ్ఘాన్ నెగ్గితే.. సమీకరణం ఆసక్తిదాయకంగా మారుతుంది.
ఒకవైపు భారత జట్టు తన మూడు మ్యాచ్ లలో భారీ విజయాలను నమోదు చేయాలి, ఆఫ్ఘాన్ ను కూడా చిత్తుగా ఓడించాలి. ఆఫ్ఘాన్ చేతిలో కివీస్ ఓడిపోవాలి. అది కూడా స్వల్ప తేడాతోనే! ఒకవేళ కివీస్ తన తదుపరి మ్యాచ్ లలో రెండింటిలో ఓడిపోయినా, ఇండియాకు ఛాన్సులుంటాయి.
తను గెలవాల్సిన మ్యాచ్ లలో ఓడిపోయి ఇండియా పరిస్థితి ఇప్పుడు ఇతర జట్ల మీద ఆధారపడినట్టుగా ఉంది. చేయగలిగింది.. అనుభవలేమి జట్లపై భారీ విజయాలను నమోదు చేయడం, కివీస్ ను ఆఫ్ఘాన్ ఓడిస్తుందా, లేదా కివీస్ ను స్కాట్ లాండో, నమీబియానో ఓడించి సంచలనం రేపకపోతుందా.. అని ఆశించడం!