కొర‌క‌రాని కొయ్య‌గా త‌యారైన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ ప్ర‌భుత్వానికి అధికార పార్టీ ఎమ్మెల్యే కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు. రోజురోజుకూ ఆ ఎమ్మెల్యే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల తీవ్ర‌త పెంచుతున్నారు. అధికార పార్టీ చేష్ట‌లుడిగి ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టేస్తున్న ఆ ప్ర‌జాప్ర‌తినిధే…

ఏపీ ప్ర‌భుత్వానికి అధికార పార్టీ ఎమ్మెల్యే కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు. రోజురోజుకూ ఆ ఎమ్మెల్యే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల తీవ్ర‌త పెంచుతున్నారు. అధికార పార్టీ చేష్ట‌లుడిగి ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టేస్తున్న ఆ ప్ర‌జాప్ర‌తినిధే తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి. గ‌త కొన్ని రోజులుగా సొంత ప్ర‌భుత్వంపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇవాళ మ‌రోసారి ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ ముందస్తు ఎన్నిక‌లొస్తే ఇంటికెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న తీవ్ర హెచ్చ‌రిక చేయ‌డం గ‌మ‌నార్హం. ఇవాళ ఆయ‌న ఓ స‌మావేశంలో మాట్లాడుతూ స‌చివాల‌యాల నిర్మాణాలు ముందుకు సాగ‌క‌పోవ‌డంపై ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వం బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌చివాల‌యాలు నిర్మాణాల‌కు నోచుకోలేద‌ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

సైదాపురం మండ‌లంలో స‌చివాల‌యాలు ఎందుకు నిర్మాణాల‌కు నోచుకోలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వైసీపీకి ప్ర‌జ‌లు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతోంద‌న్నారు. ఇంకా స‌చివాల‌యాల నిర్మాణాలు పూర్తి కాలేద‌న్నారు. ఇందుకు కార‌ణం… సాంకేతిక‌ప‌ర‌మైన లోటుపాట్లా? క‌ట్ట‌డానికి ముందుకు రావ‌డం లేదా? లేదంటే క‌ట్ట‌డానికి ముందుకొచ్చినా బిల్లుల చెల్లింపుల్లో ఆల‌స్యం అవుతుంద‌నా? ఎందుకు జ‌రుగుతున్న‌దో తెలియ‌ద‌న్నారు. సైదాపురం మండ‌లంలో ఒక‌ట్రెండు స‌చివాల‌యాల‌ను మాత్ర‌మే తాను ప్రారంభించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. మిగిలిన‌వి ఎక్క‌డున్నాయో అధికారుల‌కు తెలుసేమో గానీ, త‌నకైతే తెలియ‌ద‌న్నారు.

స‌చివాల‌యాల నిర్మాణాలు అయిపోతాయ‌ని అంటున్నార‌న్నారు. అయిపోతాంది… మీరిచ్చిన ఐదు సంవ‌త్స‌రాల కాలం పూర్తి అయిపోతాంద‌ని వ్యంగ్యంగా అన్నారు. కానీ స‌చివాల‌యాల నిర్మాణానికి ఇచ్చిన ఏడాది గ‌డువు కాలం అయిపోతాంద‌ని నాయ‌కులు, అధికారులు గుర్తించుకోవాల‌న్నారు. ఎమ్మెల్యేల‌కు ఇచ్చిన ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో చివ‌రి ఏడాది మాత్ర‌మే మిగిలి వుంద‌న్నారు. ప‌త్రిక‌ల్లో చూస్తున్నాం… ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అని ఆయ‌న అన్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌లొస్తే ఏడాది కూడా వుండ‌దు… ఇంకా ముందే ఇంటికి పోతామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా వైసీపీ అధికారం నుంచి దిగిపోవ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న బ‌హిరంగంగానే తేల్చి చెప్పారు. ఒక‌వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేగా వుంటూ, వైసీపీ శ్రేణుల మ‌నోస్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఆనం మాట్లాడుతుండ‌డంపై అధిష్టానం సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు స‌మాచారం. ఒక‌ట్రెండు రోజుల్లో ఆనం విష‌య‌మై వైసీపీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం వుంది.