హీరో అల్లరి నరేష్ మరో సీరియస్ సబ్జెక్ట్ తో రెడీ అయ్యాడు. తాజాగా వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా పూర్తిగా నిరాశపరిచినప్పటికీ, అల్లరోడు మాత్రం తన పంథా వీడలేదు. ఈసారి ఉగ్రం అనే మూవీని సిద్ధం చేస్తున్నాడు. కాకపోతే ఈ ప్రాజెక్టుపై ఈ హీరో చాలా నమ్మకంతో ఉన్నాడు.
దీనికి కారణం దర్శకుడు విజయ్ కనకమేడల. ఇంతకుముందు అల్లరి నరేష్ కు నాంది అనే హిట్ సినిమా ఇచ్చాడు విజయ్. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఉగ్రం సినిమా చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. వేసవి కానుకగా ఏప్రిల్ 14న ఉగ్రం సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. డేట్ ఎనౌన్స్ మెంట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
టీజర్ లో అల్లరి నరేష్ తన ఉగ్రరూపం చూపించాడు. చీకట్లో బండిపై వచ్చి, గన్ తీసి కోపంగా అరుస్తూ కాల్చే సన్నివేశాన్ని టీజర్ గా విడుదల చేశారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు అల్లరినరేష్.
ఏప్రిల్ లో ఇప్పటికే భారీ పోటీ నెలకొంది. అల్లరి నరేష్ ప్రకటించిన తేదీకి ముందు, వెనక గట్టి పోటీ ఉంది. అయినప్పటికీ సమ్మర్ ను టార్గెట్ చేశాడు ఈ హీరో. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.