పవన్ కల్యాణ్ జనాల్లోకి వస్తున్నారు, ఇకపై జనాల్లోనే ఉంటారు. రాజకీయాలు ఫస్ట్.. సినిమాలు నెక్స్ట్ అనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. తాజాగా జిల్లాల పర్యటనలకు పవన్ వస్తున్నారంటూ మరో ప్రచారం మొదలైంది. ఇంతకీ ఇదైనా నిజమేనా లేక పవన్ అలిగి మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోవడం ఖాయమేనా..? పవన్ నిలకడ మీద ఉండగలరా..? అనే చర్చ మళ్లీ మొదలైంది.
పాతికేళ్ల ప్రస్థానం కోసం రాజకీయాల్లోకి వచ్చాను, మీ భవిష్యత్తు మార్చేస్తానంటూ పవన్ ప్రచారం చేసుకునేవారు. తీరా వైసీపీ గెలిచాక జగన్ పాలన బాగుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా, సినిమాలు చేసుకుంటా అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు నిజంగానే సినిమాలకు పరిమితం అయ్యారు.
అంటే జగన్ పాలన బాగుంది అని ఒప్పుకున్నట్టేనా అంటే అదీ కాదట. తన దగ్గర డబ్బుల్లేవు కాబట్టి, డబ్బులుంటేనే పార్టీని నడిపించగలం కాబట్టి సినిమాల్లోకి వెళ్లానన్నారు పవన్.
ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సినిమాలు ఒప్పేసుకుని, బల్క్ కాల్షీట్లిచ్చేసి, మధ్యమధ్యలో షూటింగ్ గ్యాప్ లోనే ఏదో పార్టీ కోసం పనిచేసినట్టు.. ఏవేవే పేపర్లు చూస్తూ సంతకాలు పెడుతూ బాగానే బిల్డప్ ఇచ్చారు.
షూటింగ్ స్పాట్ లోనే కాదు, కారవాన్ లో కూడా యాక్టింగ్ చేశారు పవన్. ఆ మాట అంటే పవన్ అభిమానులకు కోపం వస్తుంది, మరి షూటింగ్ స్పాట్ లో రాజకీయాలేంటి..? పోనీ అలాంటి రాజకీయాల వల్ల ఏమైనా ఫలితం ఉందా..?
నిలకడలేని పవన్..?
పవన్ రాజకీయాల్లో ఉంటారా..? సినిమాల్లోనే ఉండిపోతారా..? అభిమానులకు సైతం ఆన్సర్ దొరకని భేతాళ ప్రశ్న ఇది. మూడ్ బాగుంటే సినిమాలు, బాగోలేకపోతే రాజకీయాలు.. ఇదీ ప్రస్తుతం పవన్ వ్యవహారం. అట్నుంచి ఇటు కూడా అనుకోవచ్చు, తప్పులేదు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ సత్తా ఏంటో తెలుస్తుంది అనుకున్న టైమ్ లో అర్థాంతరంగా ప్రచారం ఆపేసి హైదరాబాద్ చేరుకున్నారు. పోనీ బద్వేల్ లో టాలెంట్ చూపిస్తారేమో అనుకుంటే.. అక్కడ సెంటిమెంట్ డైలాగ్ కొట్టి వెనకడుగేశారు.
ఒక అవకాశాన్ని బీజేపీ లాగేసుకుంటే, ఇంకో అవకాశాన్ని తానే చేతులారా వదిలేసుకుంటున్నారు పవన్. మొత్తమ్మీద పవన్ కి ఇటు రాజకీయాలపై కానీ, అటు సినిమాలపై కానీ దేనిమీదా నిలకడలేదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.
జిల్లా పర్యటనలపై తాజా ప్రకటనలో నిజమెంత..?
ఆ మధ్య పవన్ కల్యాణ్ మండలాల వారీగా కమిటీలు వేస్తున్నారని, పార్టీకి జవసత్వాలు తీసుకొస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన తీరిక ఉన్నప్పుడు ఒక్కో జిల్లాకు, ఒక్కో మండలానికి కమిటీలు ప్రకటించారు కానీ… మొత్తం పని ఒకేసారి పూర్తి చేయలేదు. కనీసం జిల్లాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ఆలోచన కూడా పవన్ కి లేనట్టే ఉంది.
అంతలోనే మరో ప్రచారం ఊపందుకుంది. విశాఖ టూర్ తర్వాత పవన్ జిల్లాలకు వస్తారని, ఒక్కటి కూడా మిస్ కాకుండా మొత్తం 13 జిల్లాలు చుట్టేస్తారని అంటున్నారు. మరి ఈ ప్రచారమైనా నిజమవుతుందో లేదో చూడాలి. ఒకవేళ నిజం కాకపోతే మాత్రం, భవిష్యత్తుల్లో జనసైనికులు ఇలాంటి ప్రచారాన్ని అస్సలు నమ్మరు.