నిజంగా భారత క్రికెట్ అభిమానులు సిగ్గుపడాల్సిన విషయం ఇది. అందరూ ఈ చెత్తమాటలు మాట్లాడకపోవచ్చు గాక.. టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో.. ప్రత్యేకంగా భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీని టార్గెట్ చేసుకుని, ఆన్ లైన్ లో మత విద్వేష వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. దేశంలో అసహనం ప్రబలుతోందని కొన్నేళ్ల కిందట కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యానాలకు ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తూ ఉంది.
టీమ్ మొత్తం సరిగా ఆడలేదు.. ఓడిపోయింది. ఓడిపోయింది కేవలం షమీ మాత్రమే కాదు. క్రికెట్ 11 మంది ఆటగాళ్ల ఆట అని ఎవరికీ చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. ఒకవేళ షమీ ఒకటే పేలవ ప్రదర్శన చేశాడు, మిగతా వాళ్లంతా ఊడబొడిచారా? అంటే అది కూడా లేదు.
ఓపెనర్ల దగ్గర నుంచి భారత జట్టు ఫెయిల్యూర్ మొదలైంది. అరివీర భయంకర టీ20 హిట్టర్లుగా ఖ్యాతి కలిగిన వాళ్లంతా ఆ మ్యాచ్ లో సరిగా ఆడలేదు. వాస్తవానికి టాస్ దగ్గర నుంచినే టీమిండియాకు కలిసి రాలేదని స్పష్టం అవుతూ ఉంది. మరి భారత ఓటమికి ఎన్నో కారణాలు ఉంటే.. షమీని ఉద్దేశించి, అతడు ముస్లిం కాబట్టి, తనేదో కుట్ర చేసి పాక్ ను గెలిపించాడన్నట్టుగా సోషల్ మీడియాలో కొందరు ముష్కరులు కామెంట్లు చేయడం నీఛం.
ఇదే అసహనం అంటే. ఈ నీఛాన్ని భారత మాజీ క్రికెటర్లు కూడా ఖండిస్తున్నారు. సెహ్వాగ్ లాంటి వారు నోరు విప్పారు. రాజకీయ నేతల సంగతెలా ఉన్నా.. ఈ నీఛ ప్రచారాలను ఖండించాల్సింది క్రికెటర్లే. ఇది వరకూ టీమిండియాకు పలు మరపురాని విజయాలు దక్కిన సమయంలో షమీ తన వంతు పాత్ర పోషించాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా షమీ ఫాస్ట్ బౌలర్ గా మ్యాచ్ మ్యాచ్ కూ రాటుదేలుతూ వచ్చాడు, వస్తున్నాడు.
ఇలా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మనవాడిని పట్టుకుని, ఓడిపోయిన సందర్భంలో అతడి మతాన్ని ప్రస్తావిస్తూ మానసిక దాడికి దిగడానికి మించిన నీఛం మరోటి ఉండదు. మన కన్నా ఎంతో తక్కువ అనుకునే బంగ్లాదేశ్ కూడా జాతీయ జట్టులో పలువురు హిందువులకు చోటు కల్పిస్తూ ఉంది.
ఇప్పుడు కూడా బంగ్లా టీమ్ లో ముగ్గురు హిందూ కుర్రాళ్లు ఫైనల్ లెవన్ లో కనిపిస్తూ ఉంటారు. అవతలి జట్టులో అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే, వీర దేశభక్తులు మతం పేరులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లను కూడా అవమానించడానికి వెనుకాడటం లేదు. షేమ్, షేమ్!