ప్రస్తుతానికి అయితే ద్వీపాంతరవాసానికి వెళ్లిన తెలుగుదేశం నేత పట్టాభి పై తెలుగుదేశం పార్టీనే దాడి చేయించే అవకాశాలున్నాయా? పట్టాభికి ఇప్పుడు ఏం జరిగినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేశారు, చేయించారని.. టీడీపీ గగ్గోలు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.
మరి ఈ అవకాశాన్నే ఆ పార్టీ ఉపయోగించుకోవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. పట్టాభిపై చంద్రబాబు నాయుడే దాడికి ప్లాన్ చేయించవచ్చని, ఆ దాడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు విష రాజకీయానికి ప్లాన్ చేయవచ్చనే అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు రాజకీయాల తీరును గమనిస్తే, ఇటీవల పట్టాభి వ్యవహారాన్ని కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవడాన్ని బట్టి చూస్తే.. పట్టాభిపై భౌతిక దాడికి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డుగా, ఆన్ ద రికార్డుగా అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పట్టాభి తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. దానిపై కొంతమంది ఉద్రేకానికి గురై టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగారు.
దాదాపు ఏడాదిన్నర నుంచి ఇళ్లు కదలని చంద్రబాబు నాయుడు ఈ రాజకీయాన్ని ఉపయోగించుకుని ఢిల్లీ వరకూ వెళ్లారు. అనుకూల మీడియా ఈ వ్యవహారాన్ని కోతి పుండు బ్రహ్మాండం అన్నట్టుగా మార్చింది.
ఇలాంటి నేపథ్యంలో రేపోమాపో పట్టాభి విదేశీ విహారాన్ని ముగించుకుని వచ్చాకా..కుటిల రాజకీయం ఆగుతుందని ఎవరూ చెప్పలేరు! ఇప్పుడైతే పట్టాభిని ఈగ వాలినా టీడీపీ నానా రచ్చ చేస్తుంది. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు అనే నెపంతో ఏదైనా దాడి జరిగితే, ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని, తెలుగుదేశం నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రపతి పాలన విధించాలని.. టీడీపీ మరింతగా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఆల్రెడీ రాష్ట్రపతి పాలన అనే అర్థం లేని డిమాండ్ ను ఒకటి తలకెత్తుకున్నారు. అది కామెడీ అయిపోకోడదనుకుంటే.. టీడీపీకి ఏదో రచ్చ కావాలి, దాని కోసం పట్టాభిపై అటాక్ జరిగినా ఆశ్చర్యం లేదని, టీడీపీ అధినేతే ఇలాంటి విష రాజకీయ ఉచ్చును పన్నవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు! మరి లోగుట్టు పెరుమాళ్లకెరుక!