ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రోజురోజుకూ బలహీనపడుతోంది. పరిషత్ ఎన్నికల బహిష్కరణ పిలుపుతో టీడీపీ శ్రేణులు ప్రత్యామ్నాయ వేటలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీకి త్వరలో “టు లెట్” బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చతికల పడింది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో మరీ దారుణంగా రెండంటే రెండే సీట్లలో టీడీపీ విజయం సాధించింది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రస్తుతానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఉన్నారు. భవిష్యత్లో ఆమె గమ్యం, గమనం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీడీపీకి, భూమా అఖిలప్రియకు గట్టి షాక్ తగిలింది. చాగలమర్రి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామ్గురిరెడ్డి నేడో, రేపో వైసీపీ కండువా కప్పుకుని గంగుల పంచన చేరనున్నారు. దీంతో ఆళ్లగడ్డ నియోజక వర్గంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే టీడీపీ ముఖ్యనేత, భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాచుపల్లె రఘునాథరెడ్డి పార్టీని వీడి వైసీపీలో చేరారు. దివంగత భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి ఎలాగో, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే దివంగత భూమా శేఖరరెడ్డికి రఘునాథరెడ్డి అంతే ఆప్తుడిగా పేరు.
ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో భూమా కుటుంబాన్ని వీడి రఘునాథరెడ్డి గంగుల కుటుంబానికి దగ్గర కావడం గమనార్హం. భూమా కుటుంబానికి సన్నిహితులైన వారిని ఒక్కొక్కరిగా వైసీపీలోకి తీసుకోవడంలో రఘునాథరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీలో చివరికి భూమా అఖిలప్రియ ఒక్కరే మిగిలేలా ఉన్నారు. ఆమె కూడా టీడీపీలో మిణుకు మిణుకు మంటుండంతో ఆ నియోజకవర్గానికి టు లెట్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.