టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్, జీత‌మెంతంటే!

టీమిండియా నూత‌న హెడ్ కోచ్ గా నియ‌మితం అయ్యాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్. త్వ‌ర‌లోనే ర‌విశాస్త్రీ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో కొత్త కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఎంపిక జ‌రిగిన‌ట్టుగా…

టీమిండియా నూత‌న హెడ్ కోచ్ గా నియ‌మితం అయ్యాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్. త్వ‌ర‌లోనే ర‌విశాస్త్రీ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో కొత్త కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఎంపిక జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. కోచ్ ప‌ద‌వి కోసం ఈ సారి బీసీసీఐ ఇంట‌ర్వ్యూలు కండ‌క్ట్ చేయ‌నుంద‌ని, దాని కోసం ప‌లువురు విదేశీ మాజీ ఆట‌గాళ్లు కూడా ద‌ర‌ఖాస్తులు చేసుకోనున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అదంతా ఏమీ లేకుండా.. గంగూలీ, జై షాలు క‌లిసి కోచ్ ను ఎంపిక చేశార‌ని, ద్రావిడ్ తో చ‌ర్చ‌లు జ‌రిపి ఫుల్ టైమ్ హెడ్ కోచ్ గా ద్రావిడ్ ను ఎంపిక చేశార‌ని స‌మాచారం.

ద్రావిడ్ కాంట్రాక్ట్ రెండేళ్ల పాటు ఉంటుంద‌ని, ద్రావిడ్ కు వార్షిక వేత‌నంగా ప‌ది కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని సెట్ చేశార‌ని స‌మాచారం. 60 యేళ్ల వ‌య‌సు దాటిన వారు టీమిండియా కోచ్ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు ఉండ‌వు. త్వ‌ర‌లోనే ర‌విశాస్త్రి వ‌య‌సు  ఆ ప‌రిమితిని చేర‌నుంది. దీంతో త‌ప్ప‌నిస‌రిగా ర‌విశాస్త్రి కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కొత్త కోచ్ ఎంపిక అనివార్యం అయ్యింది.

ఇక ఈ సారి కోచ్ ఎంపిక విష‌యంలో కెప్టెన్ కొహ్లీ అభిప్రాయాల‌ను కూడా పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు బీసీసీఐ. ఇది వ‌ర‌కూ కోచ్ ఎంపిక‌లో కొహ్లీనే కీల‌క పాత్ర పోషించాడు.  కుంబ్లే ఆ బాధ్య‌త‌ల నుంచి వైదొల‌గ‌డానికి కార‌ణం కొహ్లీనే అనే వార్త‌లు వ‌చ్చాయి. అలాగే త‌న‌కు అన్ని ర‌కాలుగానూ సెట్ అవుతాడ‌నే ర‌విశాస్త్రిని కోచ్ గా వ‌చ్చేలా కొహ్లీ చూసుకున్నాడ‌నే మాట కూడా వినిపించింది. అయితే ఇప్పుడు కొహ్లీ మాట గ‌తంలాగా చెల్లుబాటు అయ్యే అవ‌కాశాలు లేవు.

ఇప్ప‌టికే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న‌ట్టుగా కొహ్లీ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. అయితే వ‌న్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా కొహ్లీని త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో ద్రావిడ్ ను కోచ్ గా ఎంపిక చేయ‌డంలో కూడా బీసీసీఐ పెద్ద‌ల నిర్ణ‌యమే ఫైన‌ల్ అవుతోంద‌ని స్ప‌ష్టం అవుతోంది. మ‌రి టెస్టు జ‌ట్టు వ‌ర‌కూ అయినా ద్రావిడ్, కొహ్లీ ప‌ని చేయాల్సి రావొచ్చు. ద్రావిడ్ దూకుడైన స్వ‌భావం కాదు, కొహ్లీ-ద్రావిడ్ ల‌ది పూర్తి వ్య‌తిరేక స్వ‌భావం. మ‌రి వీరిద్ద‌రూ క‌లిసి ప‌ని చేయ‌గ‌ల‌రా? గ‌తంలో కుంబ్లే కు ఎదురైన అనుభ‌వ‌మే కొహ్లీతో ద్రావిడ్ కు త‌ప్ప‌దా?  లేక కొహ్లీనే కామ్ కావాల్సి వ‌స్తుందా.. అనేది ఇక‌పై చ‌ర్చ‌నీయాంశాలు అవుతాయేమో!