సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడ్తారనే పేరుంది. తాజాగా ఆయన మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే తాను అనని మాటలను అన్నట్టు ఓ చానల్ ప్రసారం చేసిందని, దానిపై కోర్టుకెళ్లి క్రిమినల్ చర్యలు తీసుకునేలా న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. సహజంగా నారాయణ సంచలనాల ప్రియుడు కావడంతో, ఆయన అనే వుంటారని జనం నమ్మారు.
వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యంగ్యంగా చెప్పాలనుకున్నారు. నిజానికి ఆయన అన్నట్టుగా ప్రసారమైన వీడియోలో జగన్ సతీమణి పేరు ప్రస్తావన లేకపోయినా, ఆ అర్థం వచ్చేలా ఘాటు వ్యాఖ్యలు చేశారని నమ్మేందుకు ఆస్కారం ఏర్పడింది.
“సంక్షేమ పథకాల కోసం జగన్ ప్రభుత్వం అన్నీ తాకట్టు పెడుతోంది. తాకట్టు పెడితే పెట్టుకో నాయనా… ధర్మరాజులా తాకట్టు పెట్టొద్దు. ధర్మరాజు తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి…చివరికి వాళ్ల భార్యని కూడా తాకట్టు పెట్టారు. పొరపాటున ఆ పని చేయొద్దు. ధర్మరాజు పాలన సగం వరకే చేయి. ముందుకెళితే కొంప కొల్లేరు అవుతుంది” అని వెటకారంగా అన్నట్టు విస్తృతంగా ప్రచారమైంది.
జగన్ సతీమణి వైఎస్ భారతిని రాజకీయాల్లో లాగడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వైఎస్ జగన్ అంటే గిట్టని ఎల్లో మీడియా విస్తృతంగా నారాయణ వ్యాఖ్యలను ప్రచారం చేయడంతో వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. దీంతో నారాయణకు పెద్ద ఎత్తున ఫోన్ చేసి తిడుతున్నట్టుగా… ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నారాయణ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను అనని మాటలను అన్నట్టు ప్రసారం చేసిన చానల్‌పై క్రిమినల్ చర్యలు తీసుకుంటానన్నారు. అంతేకాదు, స్త్రీలు, కుటుంబాలపై తాను ఎప్పుడూ మాట్లాడనని పేర్కొన్నారు. తాజాగా నారాయణ విడుదల చేసిన ఆ వీడియోలో ఏమన్నారంటే…
“ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై నేను మాట్లాడినట్టు ఒక చానల్ ప్రసారం చేసింది. అందులో నా వాయిస్ లేదు. నా వాయిస్ ఏపీ సీపీఐ చానల్‌లో పూర్తిగా ఉంది. అక్కడ ఎక్కడా కూడా అసభ్యంగా మాట్లాడినట్టు లేదు. నేను రాజకీయాలే మాట్లాడాను. రాజకీయాలు మళ్లీమళ్లీ మాట్లాడుతూనే ఉంటాను. చంపినా మాట్లాడ్తాను. భయమేమీ లేదు. అయితే నేను చెప్పని మాటను క్యాప్షన్‌గా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. అందరి సెంటిమెంట్స్‌ను బాధపెట్టారు. ఆ మాటంటే ఎవరికైనా బాధ వుంటుంది. నాకు కూడా బాధ ఉంటుంది. కానీ నేను అన్లేదు. నేను పొరపాటున కూడా స్త్రీలు, కుటుంబాల గురించి మాట్లాడలేదు.
అనవసరంగా అపార్థం చేసుకుని నాకు ఫోన్లు చేస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవం ఏంటో తెలుసుకుని … నన్ను తిడుతున్న వాళ్లు పశ్చాత్తాప పడతారు. నేను ఆ మాట అనలేదని నిరూపిస్తా. నేను అనని విషయాన్ని ప్రసారం చేసిన చానల్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నా. కోర్టుకు వెళ్తా” అని చెప్పుకొచ్చారు. సీపీఐ నారాయణ తానన్న మాటకు కట్టుబడి సదరు చానల్‌పై క్రిమినల్ చర్యలు ఏ మాత్రం తీసుకుంటారో చూద్దాం.