త్వరలో జగన్ కేబినెట్‌లో పూర్తిస్థాయిలో మార్పులుంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆశావహుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్లకు కేబినెట్‌లో మార్పులు చేస్తానని మొట్టమొదటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి చెప్పిన సమయం రానే వచ్చింది. దీంతో కొత్త కేబినెట్‌లో స్థానం ఎవరెవరికి దక్కుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
గుంటూరు జిల్లా విషయానికి వస్తే… చిలకలూరిపేటలో ఇద్దరి పేర్లు తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకరు ఎమ్మెల్యే విడదల రజనీ, మరొకరు మర్రి రాజశేఖర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎమ్మెల్సీతో పాటు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని మర్రి రాజశేఖర్‌కు వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో జగన్ మాట తప్పడని, తన మాటకు కట్టుబడి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తారని మర్రి రాజశేఖర్ అనుచరులు ధీమాగా చెబుతున్నారు.
మరోవైపు తమ నాయకురాలికి బీసీ కోటాలో మంత్రి పదవి ఇస్తారని విడదల రజనీ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అయ్యారని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు.
పార్టీలో కష్టపడ్డ వారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని విడదల రజనీ నమ్మకంగా ఉన్నారు. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ, యువతకు జగన్ పెద్దపీట వేస్తారని, అందువల్లే తనకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశ ఆమెలో ఉన్నట్టు తెలుస్తోంది.
కానీ తమ నాయకుడికి ఎమ్మెల్సీ, మంత్రి పదవి రాకపోయినా ఫర్వాలేదని, విడదల రజనీకి మాత్రం మంత్రి పదవి ఇవ్వొద్దనే డిమాండ్ వైసీపీ పెద్దల ఎదుట మర్రి రాజశేఖర్, అలాగే అదే పార్టీకి చెందిన ఎంపీ పెట్టినట్టు తెలుస్తోంది.
విడదల రజనీ కేవలం సోషల్ మీడియా ప్రచారమే తప్ప, ఆమెకు పబ్లిక్‌లో అంత సీన్ లేదని వారు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరోవైపు మర్రి రాజశేఖర్, ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎంపీ తనను దెబ్బ తీసేందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వ పెద్దల దృష్టికి రజనీ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. చివరికి చిలకలూరిపేటలో పదవిని ఎవరు దక్కించుకుంటారనేది గుంటూరు జిల్లాలో చర్చనీయాంశమైంది.