వారాహి అంటూ ఘనంగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనానికి టైటిల్ ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దాని చుట్టూ వివాదం కూడా ముసురుకుంది. ఆ వాహనం పవన్ కల్యాణ్ కంఫర్ట్స్ కు తగినట్టుగా, భారీతనం ఉట్టిపడేలా.. అచ్చంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ఊహా ప్రపంచానికి తగినట్టుగా దాని డిజైన్ ఉంది. దాన్ని ఘనంగా ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.
అయితే ఫస్ట్ లుక్ ను చూసి అభిమానులు సంబరపడిపోయారు కానీ, అందులోని లోపాలు కూడా హైలెట్ అయ్యాయి. ఆ రంగు వాహనాన్ని రిజిస్టర్ చేయరనే వాదన మొదలైంది. అది మొదట్లో ప్రచారమే అనుకున్నారంతా.. అయితే, రవాణా శాఖ అధికారులు కూడా అదే చెబుతున్నారు. దేశంలో ఒకే రవాణా శాఖ చట్టం అమల్లో ఉందని, ఆ చట్టం ప్రకారం.. మిలటరీ వాహనాలకు తప్ప ఆలివ్ గ్రీన్ రంగులో సంచరించే అవకాశం మరొకరి వాహనానికి ఉండదని వారు కుండబద్ధలు కొట్టారు.
రవాణా శాఖ చట్టాలు దేశం మొత్తం మీదా ఒకటే అని డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆర్టీవో ఆఫీసులో కూర్చోబెట్టి చెప్పే క్లాసులో ఈ విషయాన్ని చెబుతారు. తను ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ ను దేశంలో ఎక్కడైనా చూపించుకోవచ్చని, దేశంలో రవాణా శాఖ చట్టమంతా ఒకటే అని ప్రతి ఆర్టీవో ఘనంగా చెప్పుకుంటాడు. కాబట్టి..పవన్ కల్యాణ్ వాహన రిజిస్ట్రేషన్ ఏపీలోనే కాదు, తెలంగాణలో అయినా.. గుజరాత్ లో అయినా సాధ్యం కాదని స్పష్టం అవుతోంది.
అలాగే పవన్ కల్యాణ్ వాహనం ఎత్తు కూడా భారీగా ఉంది. వాహనాలను కావాల్సినట్టుగా మోడిఫై చేయించుకోవడం కొత్త ఏమీ కాదు. అయితే ఆ మార్పు చేర్పులకు కూడా నిబంధనలుంటాయి. ఛాసీ కెపాసిటీ ప్రకారం, ఛాసీ డిజైన్ ప్రకారమే.. ఈ కస్టమైజేషన్స్ కు అవకాశం ఉంటుంది. ఆర్టీవో ఆఫీసుకు రిజిస్ట్రేషన్ కు వెళ్లినప్పుడు సామాన్యులను ముప్పు తిప్పలు పెడతారు అధికారులు. బైక్ రిజిస్ట్రేషన్ జరగాలంటే దానికి రెండు మిర్రర్స్ ఉండాల్సిందే. లేకపోతే రిజిస్ట్రేషన్ చేయకుండా ఇంటికి పంపిస్తారు. అంతే కాదు.. ఎవరైనా కొత్త బైకులపై మోజుతో పేర్లు రాయించుకుని, ఆర్టీవో ఆఫీసుకు రిజిస్ట్రేషన్ కు తీసుకెళ్లినా వాటిని తీసేసుకుని మళ్లీ రావాలని చెబుతారు! బైకులపై పేర్లు రాయించుకునే పని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసు పని తర్వాతే పెట్టుకోవాల్సి వచ్చేది.
మరి కొత్త బైకు కొని రిజిస్ట్రేషన్ కు వెళ్లినప్పుడే అధికారులు అన్ని రూల్స్ చెబుతుంటారు. మరి పవన్ కల్యాణ్ కస్టమైజ్డ్ వెహికల్ వ్యవహారం ఏమవుతుందో!