బాబు ప‌ర్య‌ట‌న ఎఫెక్ట్ః ఒక‌రికి టికెట్ ఔట్‌!

క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు త‌న మార్క్ వ్య‌వ‌హార‌శైలితో టికెట్ ఇవ్వ‌న‌నే సంకేతాల్ని పంపారు. ఇందులో భాగంగా కీల‌క నాయ‌కురాలికి టికెట్ ఇచ్చేది లేదని త‌న చ‌ర్య‌ల ద్వారా బాబు పంపార‌నే చ‌ర్చ‌……

క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు త‌న మార్క్ వ్య‌వ‌హార‌శైలితో టికెట్ ఇవ్వ‌న‌నే సంకేతాల్ని పంపారు. ఇందులో భాగంగా కీల‌క నాయ‌కురాలికి టికెట్ ఇచ్చేది లేదని త‌న చ‌ర్య‌ల ద్వారా బాబు పంపార‌నే చ‌ర్చ‌… ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా టీడీపీలో పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో భూమా నాగిరెడ్డి కుటుంబానికి తిరుగులేద‌నేది నిన్న‌టి మాట‌. ఇప్పుడా ప్ర‌చారానికి కాలం చెల్లింది.

భూమా కుటుంబంలో కొత్త వాళ్లు రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చారు. ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా సొంత కుంప‌ట్లు పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ బాగా వెనుక‌బ‌డ్డార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు నివేదిక‌లు కూడా చంద్ర‌బాబుకు అందాయి. ఈ ద‌ఫా ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే గ‌త చ‌రిత్ర‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, ప్ర‌స్తుతం ఎవ‌రి బ‌లం ఎంత అనేది మాత్ర‌మే చంద్ర‌బాబు చూస్తున్నారు.

స‌ర్వేల్లో బాగా లేద‌ని వ‌స్తే మాత్రం తోపు లీడ‌ర్ అనే వాళ్ల‌ను కూడా ప‌క్క‌న పెట్ట‌డానికి చంద్ర‌బాబు వెనుకాడ‌డం లేదు. గెలుపు త‌ప్ప మ‌రేదీ త‌న‌కు ముఖ్యం కాద‌ని చంద్ర‌బాబు తెగేసి చెబుతున్నారు. ఈ క్ర‌మంలో క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వ‌చ్చిన చంద్ర‌బాబును క‌లిసేందుకు మాజీ మంత్రి అఖిల‌ప్రియ గురువారం రాత్రి ప‌త్తికొండ వెళ్లారు. ఆమెను చూడ‌గానే చంద్ర‌బాబు ముఖ క‌వ‌ళిక‌లు పూర్తిగా మారిపోయిన‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఎందుకొచ్చావ్‌? అంటూ అఖిల‌ప్రియ‌ను నిల‌దీసినంత ప‌ని చంద్ర‌బాబు చేశార‌ని క‌ర్నూలు టీడీపీ నేత‌లు అంటున్నారు. దీంతో అఖిల‌ప్రియ అవ‌మానానికి గుర‌య్యాననే భావ‌న‌కు లోనైన‌ట్టు తెలిసింది. క‌నీసం ఫొటో తీసుకుందామ‌ని అఖిల‌ప్రియ ఆశించినా, చంద్ర‌బాబు అందుకు స‌న్న‌ద్ధంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో క‌ర్నూలులో మౌర్య ఇన్ హోట‌ల్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశానికి ఒక్క అఖిల‌ప్రియ మిన‌హాయించి ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని మిగిలిన టీడీపీ ఇన్‌చార్జ్‌లు, నేత‌లు హాజ‌రు కావ‌డం గ‌మనార్హం.

త‌న‌ది టికెట్ అడిగే స్థాయి కాద‌ని, ప‌ది మందికి ఇప్పించే కెపాసిటీ అని ఇటీవ‌ల అఖిల‌ప్రియ చెప్పిన విష‌యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప‌త్తికొండ‌లో త‌న ప‌ట్ల అస‌హ‌నంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌డంతో టికెట్ ఇవ్వ‌ర‌నే నిర్ణ‌యానికి అఖిల‌ప్రియ వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. బాబు వైఖ‌రితో మ‌న‌స్తాపానికి గురైన అఖిల‌, ఆమె త‌మ్ముడు క‌ర్నూలు స‌మావేశానికి వెళ్ల‌లేద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఇదే స‌మావేశానికి అఖిల‌ప్రియ అన్న‌, నంద్యాల ఇన్‌చార్జ్ బ్ర‌హ్మానంద‌రెడ్డి వెళ్లారు.  

అఖిల‌ప్రియ‌పై చంద్ర‌బాబు అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించ‌డం ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అఖిల‌ప్రియ‌ను కాద‌ని మ‌రొక కొత్త నాయ‌కుడిని ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా కుటుంబం నుంచే తీసుకొచ్చేందుకు ఇప్ప‌టికే చంద్ర‌బాబు సిద్ధం చేశార‌ని స‌మాచారం. దీంతో పొమ్మ‌న‌కుండా అఖిల‌ప్రియ‌కు పొగ పెట్టేందుకు చంద్ర‌బాబు ప్ర‌ణాళిక రెడీ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. టీడీపీ త‌ర‌పున అఖిల‌ప్రియ‌కు టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారాన్ని టీడీపీ నేత‌లే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.