ఏపీలో ప్రధాని మోడీ పర్యటనకు ముందు ఒక విధమైన రాజకీయ పరిస్థితి ఉంటే ఆయన పర్యటన తరువాత రాజకీయం మరోలా మారిపోయిందని తెలుస్తోంది. మోడీ పర్యటనకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు. సేమ్ అదే టైపులో చంద్రబాబూ వ్యవహరించాడు. కానీ మోడీ విశాఖకు వచ్చి పవన్ తో భేటీ అయ్యాక పవన్ గానీ, బాబు గానీ పొత్తుల మాట ఎత్తడంలేదు. బీజేపీ కూడా సైలెంటుగానే ఉంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మీడియాతో మాట్లాడిన మాటలే కాదు.. ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ సభలో అన్న మాటలు కూడా రాజకీయవర్గాల్లో హీటు పెంచేస్తున్నాయి. వీరి మాటల వెనక ఉన్న అర్థం ఏంటిరా బాబూ అని ఎవరికి వారే లెక్కలు తీస్తున్నారు.
కొన్ని రోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రా రాజకీయ ముఖచిత్రం మారుతుందని ప్రకటించారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవడమే కాకుండా అధికార పార్టీకి ఇక నా దెబ్బ ఏంటో రుచి చూపిస్తానని చెప్పు చూపించి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. ఈసారి మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా వైసీపీనీ ప్రతీ విషయంలోనూ ఇరుకునపెడుతూ యుద్ధానికి సమరశంఖం పూరించారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు కావడం, జనసేన అధినేతకు ప్రత్యేకంగా పిలుపు రావడంతో పవన్ కళ్యాణ్ చెప్పిన రాజకీయ ముఖచిత్రం మాటలు రాష్ట్ర ప్రజలకు గుర్తుకువచ్చాయి. దాదాపు అరగంటకు పైగా ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి.
అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై ఇటు బీజేపీ నుంచి కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి విపక్షం కోసం ప్రయత్నిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ వైజాగ్ పర్యటనలో రోడ్ మ్యాప్ దొరికిందా? ఆ రోడ్ మ్యాప్ ఆధారంగానే ప్రస్తుతం ముందుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు ప్రారంభించారా? ఈ రోడ్ మ్యాప్ లో ఉమ్మడి విపక్షానికి బదులు బీజేపీ-జనసేనతో కూడిన పరిమిత విపక్షాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే 2024 ఎన్నికల్లో లబ్ది పొందాలని మోడీ సూచించారా? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో తిరిగి జనసేన-టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న సంకేతాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్.. ఈ మేరకు వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్మడి విపక్షాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో టీడీపీని కూడా భాగస్వామిని చేద్దామని బీజేపీకి ప్రతిపాదిస్తున్నారు. ఇందుకోసం రోడ్ మ్యాప్ ఇమ్మని బీజేపీని కూడా కోరుతున్నారు. అయితే ప్రధాని మోడీ వైజాగ్ టూర్ లో ఈ మేరకు పవన్ కు క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు గురించి ఆలోచించవద్దని, బీజేపీ-జనసేన మాత్రం కలిసి సాగుతాయని, వచ్చే ఎన్నికల నాటికి అవసరాన్ని బట్టి టీడీపీతో పొత్తుపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి పోరుకు సహకరించాలని బీజేపీని కోరుతున్న పవన్, ఈ మేరకు తమ వంతుగా బీజేపీ-జనసేన ఉమ్మడి పోరుకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ప్రధాని మోడీ మాత్రం టీడీపీతో కలిసి పోరాటం చేసే విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పకపోవడంతో పవన్ కూడా పొత్తుల విషయంలో మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. మోడీ పర్యటనకు ముందు హడావుడి చేసిన పవన్, చంద్రబాబు మోడీ పర్యటన తరువాత పొత్తుల గురించిగానీ, కలిసి పోరాటాలు చేయడం గురించిగానీ ఏమీ మాట్లాడటం లేదు.