తెలుగుదేశం పార్టీకే తెలంగాణలో గతిలేదు గనుక.. గత్యంతరం లేని స్థితిలో తెరాసలోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి, రాజకీయ భవిష్యత్తు డౌట్ ఫుల్ గా మారుతోంది. 2018లో ఓడిపోయిన పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన రాబోయే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు గానీ.. ఆయన ఆశలకు వామపక్షాలు గండి కొడుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆల్రెడీ.. తుమ్మల ఆశలకు డోర్స్ క్లోజ్ చేసినట్టుగానే కనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం అని తమ్మినేని వీరభద్రం అంటున్నారు.
మరో కోణంలోంచి చూసినప్పుడు.. ఆలూలేదు చూలూలేదు.. కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నాయి తమ్మినేని మాటలు. తెరాస.. మునుగోడు ఎన్నికలో వామపక్షాల మద్దతు తీసుకుంది. అంతవరకు నిజం. కానీ.. రాబోయే ఎన్నికలకోసం వారితో పొత్తులు పెట్టుకుంటుందా? వారితో సీట్లను పంచుకుంటుందా? అనేది ఇంకా ఎలాంటి సంకేతం రాలేదు.
ఎన్నీ సీట్లు ఇస్తారో కూడా తెలియదు. కానీ.. తమ్మినేని అప్పుడే ఒక అడుగు ముందుకేసి ఏయే సీట్లలో తాము పోటీచేస్తామో డిసైడ్ అయిపోయినట్టున్నారు. 2018లో తెరాస ఓడిపోయిన సీటే కావొచ్చు గాక.. పాలేరులో ఎర్రజెండా ఎగురుతుందని తేల్చి చెబుతున్నారు.ఈ మాటతో తుమ్మల నాగేశ్వరరావు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నట్టే.
నిజానికి 2018లో విపరీతంగా తెలంగాణ వ్యాప్తంగా తెరాస హవా వీచిన సమయంలోనూ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఇటీవలి కాలంలో తుమ్మల పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది గానీ.. కొన్ని రోజుల కిందట ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం పెట్టుకుని అలాంటి ప్రచారాలను ఖండించారు. తెరాసను వదలిపోయే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికలో తన విజయానికి అందరూ సహకరించాలని కూడా అన్నారు. ఇంతలో ఆయనకు ముప్పు సీపీఎం రూపంలో వచ్చినట్టుంది.
సీపీఎం తమ్మినేని తొందరపడి తమ సీట్లు కూడా ప్రకటించుకున్నారు గానీ.. వారి మీద గులాబీ దళపతి కేసీఆర్ గుస్సా అవుతారని అనుకోలేం. ఎందుకంటే.. వామపక్షాల పొత్తు ఆయనకు చాలా అవసరం. భారాస గా జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటే.. ఇతర రాష్ట్రాల్లో అస్తిత్వం కోసం వారితో కలసి నడవడం అవసరం. అందుకోసం వారు అడిగిన సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. మరి కేసీఆర్ కోసం.. పాతమిత్రుడు తుమ్మల బలిపశువు అవుతారా? లేదా.. పుకార్లను నిజం చేస్తూ పార్టీ మారుతారా? అనేది వేచిచూడాలి.