సిక్స‌ర్ల సిద్ధూ సీఎం కాబోతున్నాడా..?

సీనియ‌ర్ కాంగ్రెస్ నేత అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ సీఎం పోస్టు ఖాళీ అయ్యింది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు, అమ‌రీంద‌ర్ మ‌రోసారి నెగ్గుకు వ‌స్తారా? అనే చ‌ర్చ జ‌ర‌గాల్సిన నేప‌థ్యంలో అనూహ్యంగా అమ‌రీంద‌ర్ మాజీ సీఎం…

సీనియ‌ర్ కాంగ్రెస్ నేత అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ సీఎం పోస్టు ఖాళీ అయ్యింది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు, అమ‌రీంద‌ర్ మ‌రోసారి నెగ్గుకు వ‌స్తారా? అనే చ‌ర్చ జ‌ర‌గాల్సిన నేప‌థ్యంలో అనూహ్యంగా అమ‌రీంద‌ర్ మాజీ సీఎం అయ్యారు. కెప్టెన్ తో సిద్ధూ త‌గ‌వు నేప‌థ్యంలో.. ఆయ‌న ప‌ద‌వి కోల్పోయార‌ని స్ప‌ష్టం అవుతోంది. మ‌రి అమ‌రీందర్ స్థానంలో ఎవ‌రు సీఎం అవుతార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యంగా మారింది.

ప్ర‌స్తుత ప‌రిణామాల్లో సిద్ధూ సీఎం కాబోతున్నాడా? ఒక రాష్ట్ర సీఎం ప‌ద‌విని చేపట్టిన మాజీ క్రికెట‌ర్ గా సిద్ధూ అరుదైన రికార్డును నెల‌కొల్ప‌బోతున్నాడా.. అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే సిద్ధూను కాంగ్రెస్ హైక‌మాండ్ సీఎం పీఠంపై కూర్చోబెట్టే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉన్న‌ట్టున్నాయి. 

ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం ప్ర‌కారం అయితే.. పంజాబ్ సీఎం పీఠం రేసులో సునీల్ జ‌క్క‌ర్ ముందున్నార‌నే మాట వినిపిస్తోంది.  ఈయ‌న సిద్ధూ క్యాంపుకు అనుకూలుడే. హిందూ. ముఖ్య‌మంత్రిగా హిందువును, పీసీసీ చీఫ్ గా సిద్ధూ రూపంలో సిక్కును ఉంచి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కాంగ్రెస్ హై క‌మాండ్ భావించ‌వ‌చ్చ‌ని టాక్. అయితే సిద్ధూ త‌న‌ను త‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగే  జ‌క్క‌ర్ ఎమ్మెల్యే కాదు. ఇలాంటి నేప‌థ్యంలో అధిష్టానం ఛాయిస్ గా సిద్ధూ ప్రొజెక్ట్ అయ్యే అవ‌కాశాలున్నాయా? అనేది ప్ర‌శ్నార్థ‌కం.

ఇక అమ‌రీంద‌ర్ రాజీనామాతో ఆయ‌న వెంట ఎమ్మెల్యేలు ఎవ‌రూ లేర‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమ‌రీంద‌ర్ రాజీనామా అనంత‌రం సీఎల్పీ భేటీ జ‌ర‌గ‌గా కేవ‌లం ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే దానికి హాజ‌రు కాలేద‌ట‌. గైర్హాజ‌రైన ఇద్ద‌రిలో ఒక‌రు అమ‌రీంద‌ర్ సింగ్!