పంజాబ్ రాజకీయంలో మరో హాట్ అప్ డేట్ చోటు చేసుకుంది. గత కొన్నాళ్ల అంతర్గత రాజకీయం నేపథ్యంలో కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టుగా సమాచారం. అధిష్టానం ఆదేశాలనుసారమే అమరీందర్ రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
50 మంది ఎమ్మెల్యేలు అమరీందర్ ను తప్పించాలంటూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారట. ఈ నేపథ్యంలో అమరీందర్ ను రాజీనామా చేయాలంటూ అధిష్టానం కోరిందని, దీంతో ఆయన రాజీనామా చేసినట్టుగా సమాచారం.
మొత్తం 117 మంది సభ్యులున్న స్టేట్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వారిలో సగం మందికి పైగా అమరీందర్ పై అవిశ్వాసాన్ని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం అమరీందర్ పై వేటు వేసినట్టుగా ఉంది.
గత కొన్నాళ్లుగా అమరీందర్ వర్సెస్ సిద్ధూ యుద్ధం తీవ్రంగానే సాగుతూ వస్తోంది. ఒకవైపు సిద్ధూకు ప్రాధాన్యతను ఇస్తూనే, మరోవైపు అమరీందర్ కు కూడా తగినంత విలువను ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. అమరీందర్ ను తప్పించాలనే డిమాండ్ ను ఇన్నాళ్లూ పట్టించుకోలేదు.
అయితే సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించారు. తద్వారా ఇద్దరినీ మెప్పించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావించింది. అయితే ప్రస్తుత పరిణామాలపై అమరీందర్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం రాజీనామాను కోరలేదని, అమరీందరే రాజీనామా చేశాడనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది.