పార్టీ వీడుతాడ‌నే నేత‌కు ఎమ్మెల్యే టికెట్‌

వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ ష‌ర్మిల దూకుడు మీద ఉన్నారు ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్ల గ‌డువు వుండ‌గానే త‌న పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు తెర‌తీశారు. ఒక‌వైపు వైఎస్సార్‌టీపీలోకి ఇత‌ర పార్టీల నుంచి…

వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ ష‌ర్మిల దూకుడు మీద ఉన్నారు ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్ల గ‌డువు వుండ‌గానే త‌న పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు తెర‌తీశారు. ఒక‌వైపు వైఎస్సార్‌టీపీలోకి ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌లు లేక‌పోగా, ఉన్న‌వాళ్ల‌లో ముఖ్యులు ఒక్కొక్క‌రుగా జారుకోవ‌డం ఆ పార్టీ శ్రేణుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది.

ఈ నేప‌థ్యంలో పార్టీ కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌కుండా స్త‌బ్ధుగా ఉన్నాడ‌ని, పార్టీ నుంచి వెళ్లిపోతాడ‌ని విస్తృత ప్ర‌చారానికి కేంద్ర బిందు వైన ఏపూరి సోమ‌న్న అభ్య‌ర్థిత్వాన్ని ఆమె ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. సూర్యాపేట జిల్లా తిరుమ‌ల‌గిరిలో ఆదివారం పెద్ద ఎత్తున ద‌ళిత‌భేరి స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో వైఎస్ ష‌ర్మిల మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

కేసీఆర్‌ను ద‌ళిత‌ద్రోహిగా అభివ‌ర్ణించారు. తెలంగాణ‌లో కేసీఆర్ పాల‌న‌లో ద‌ళితుల‌పై దాడులు 800 రెట్లు పెరిగిన‌ట్టు ఆమె తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. ద‌ళిత ఐఏఎస్ అధికారులంటే కేసీఆర్‌కు గౌర‌వం లేద‌న్నారు. అందుకే ద‌ళిత ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి వెళ్లిపోతున్నార‌న్నారు. ఇదే సంద‌ర్భంలో వేదిక‌పై ఉన్న ప్ర‌ముఖ క‌ళాకారుడు ఏపూరి సోమ‌న్న‌ను తుంగ‌తుర్తి అభ్య‌ర్థిగా ఆమె ప్ర‌క‌టించ‌డం విశేషం.

దీంతో రాబోయే ఎన్నిక‌ల‌ను తానెంతో సీరియ‌స్‌గా తీసుకున్నాన‌నే సంకేతాన్ని తెలంగాణ స‌మాజానికి పంపార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అభ్య‌ర్థుల‌ను ముందుగా ప్ర‌క‌టించ‌డం ద్వారా జ‌నంలోకి వెళ్లి పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయంలో ఆమె ఉన్న‌ట్టు తెలుస్తోంది.