పారితోషికం విషయంలో పక్కగా ఉంటుందనే పేరు తమన్నాకు. *హ్యాపీడేస్*తో తన డిమాండు పెంచుకున్న తమన్నా.. ఆ తర్వాత హిట్లు లభించినట్టల్లా పారితోషికాన్ని పెంచుకుంటూ పోయింది. పక్కా కమర్షియల్ అనిపించుకుంది. తనకు గతంలో అవకాశాలు ఇచ్చిన వారు అడిగినా.. తమన్నా డబ్బు విషయంలో అస్సలు తగ్గదని, కెరీర్ ఆరంభంలో అవకాశాలు ఇచ్చిన వారు కోరినా.. తను కోరినంత పారితోషికం ఇస్తే తప్ప సినిమాకు సై అనదనే పేరును తెచ్చుకుంది.
ఇలా ఎలా చూసినా.. తమన్నా కెరీర్ చాన్నాళ్ల పాటే దిగ్విజయం సాగింది. హీరోయిన్ల కెరీర్ రెండు మూడేళ్ల పాటే అనుకుంటున్న తరుణంలో.. తమన్నా సుదీర్ఘకాలంలోనే ఇండస్ట్రీలో ఉనికిని చాటుకుంటూ ఉంది. ఎప్పుడో దశాబ్దంన్నర కిందట ఇండస్ట్రీలోకి వచ్చిన తమన్నా.. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ఇన్నాళ్ల పాటు బిజీగానే ఉంది.
అయితే ఇప్పుడు తమన్నాకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పెద్దగా లేవు. నయనతార, కాజల్ వంటి వారి తరహాలో తమన్నా వయసు మీద పడుతున్నా స్టార్ల సినిమాల్లో అవకాశాలను సంపాదించే స్థితిలో లేదు. బాలీవుడ్ అవకాశాలు అప్పుడప్పుడున్నాయి. అలాగే ద్వితీయ ప్రాధాన్యత ఉన్న రోల్స్ వేసేందుకు కూడా తమన్నా ఇప్పటికే రెడీ అయిపోయింది.
ఇక ఇప్పుడు తక్కువ పారితోషికాల సినిమాలకు కూడా ఈమె సై అంటోంది.ఈ క్రమంలో ఒక మలయాళీ సినిమా చేస్తోంది తమన్నా. అక్కడ దిలీప్ తో జత కట్టింది. ఇది తమన్నాకు తొలి మలయాళీ సినిమా. మలయాళీ సినిమాలకు ఇప్పుడు ఇంటాబయట మంచి మార్కెట్టే ఉంది. అక్కడ కూడా గతంతో పోలిస్తే పారితోషికాలు బాగానే పెరిగాయి. అయితే ఎటొచ్చీ దిలీప్ కెరీర్ బాగా దెబ్బతింది. వివాదాలు, జైలు జీవితం.. దిలీప్ సినిమాల స్థాయిని తగ్గించి వేశాయి.
ఒకప్పుడు స్టార్ హీరో కానీ.. దిలీప్ కు ఇప్పుడు ముందున్న ఊపు లేదు. దిలీప్ పై మలయాళీ ప్రేక్షకుల్లోనే కొంత అనాసక్తి ఉంది. కేరళ ఆవల అతడి సినిమాలు పట్టించుకునే వారు లేరు. దీంతో మార్కెట్ రేంజ్ బాగా తక్కువ. అయినా తమన్నా ఇలాంటి సినిమాకు సై అన్నట్టుంది.