సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత చాలా రాష్ట్రాల్లో స్కూల్స్ తిరిగి తెరుచుకున్నాయి. ఏపీ కూడా ధైర్యంగా అడుగు ముందుకేసింది. ఆగస్ట్ 16 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పునఃప్రారంభం అయ్యాయి. అక్కడక్కడా కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నా తల్లిదండ్రులు ధైర్యంగానే పిల్లల్ని స్కూళ్లకు పంపుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి కాస్త అయోమయంలో పడింది.
స్కూల్స్ పునఃప్రారంభంపై అక్కడి హైకోర్టు కీలక తీర్పునివ్వడంతో ఆఫ్ లైన్ బోధనతో పాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏపీలో మాత్రం అలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ప్రత్యక్ష తరగతులు మాత్రమే జరుగుతున్నాయి.
తెలంగాణలో స్కూల్స్ తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైన సమయంలో ఓ ఉపాధ్యాయుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఆ పరిస్థితి వచ్చింది. స్కూల్స్ కి వచ్చేందుకు పిల్లలు, తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దని అది వారి ఇష్టానికే వదిలేయాలని కోర్టు తేల్చి చెప్పింది.
మరి ఏపీలో పరిస్థితి ఏంటి..? ఇక్కడ ఆన్ లైన్ బోధన లేదు, కేవలం స్కూల్ కి వచ్చినవారికి మాత్రమే పాఠాలు, అటెండెన్స్ కూడా కంపల్సరీ. ఈ దశలో అక్కడక్కడ కేసులు పెరుగుతున్నా విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం అధైర్యపడటం లేదు. అయితే ఎవరో ఒకరు కోర్టుని ఆశ్రయిస్తే మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆఫ్ లైన్ బోధన కంపల్సరీ చేయొద్దంటూనే తెలంగాణ హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. ఆన్ లైన్ బోధనతో కేవలం పట్టణాల్లో ఉన్నవారికే ప్రయోజనం ఉంటుందని, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు లేని పేద పిల్లలు ఇబ్బంది పడతారని, వారి గురించి కూడా ఆలోచించాలని చెప్పింది. అదే సమయంలో స్కూల్స్ తెరిస్తే కరోనా భయం కూడా ఉంటుందని, అందుకే విద్యార్థులను కానీ, వారి తల్లిదండ్రులను కానీ ఆ విషయంలో బలవంత పెట్టొద్దని సూచించింది.
మరోవైపు ఏపీలో మాత్రం ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని స్కూల్స్ మొదలు పెట్టింది. వారం వారం ప్రతి స్కూల్ లో కొవిడ్ ర్యాండమ్ పరీక్షలు జరుపుతోంది. ప్రస్తుతానికి అక్కడక్కడ కరోనా కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ.. థర్డ్ వేవ్ భయాలు మొదలైతే మాత్రం ఏపీలో కూడా తరగతిగది బోధన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.