2008లో ఐపీఎల్ తొలి సీజన్ జరిగింది. అంతకు కొన్ని నెలల ముందు ప్రాంచైజ్ వేలం జరిగింది. ఆ సమయంలో ఒక్కో జట్టు రేటు వందల కోట్ల రూపాయల స్థాయిలో పలికి సంచలనంగా నిలిచింది. సగటున నాలుగు వందల కోట్ల రూపాయల స్థాయిలో ఐపీఎల్ జట్టు రేటు పలికింది నాటి వేలం పాటలో. అత్యల్ప ధరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు ను కొన్నారు. డెక్కన్ చార్జెస్ జట్టును కూడా అప్పట్లో సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల ధరకు పదేళ్ల హక్కులను కొనుగోలు చేశారు.
అయితే అప్పట్లో బీసీసీఐ ప్రకటించింది ఏమిటంటే.. పదేళ్లు గడిచాకా, మొత్తం ఒప్పందాలు రద్దు అవుతాయని. పదేళ్లకు మళ్లీ వేలం పాటను నిర్వహిస్తామని, కొత్త యాజమాన్యాలు రంగంలోకి దిగి ఆయా ప్రాంచైజ్ ల వేలం పాటను పాడుకోవచ్చని మొదట్లో బీసీసీఐ ప్రకటించింది. అయితే అదేమీ జరగలేదు. ఇప్పటికీ మొదట ప్రారంభం అయిన ఎనిమిది జట్లకు సంబంధించి, ఆరు జట్లకు అవే యాజమాన్యాలే ఉన్నట్టున్నాయి. హైదరాబాద్ జట్టును కొన్న డెక్కన్ క్రానికల్ గ్రూప్ చాలా యేళ్ల కిందటే హక్కులను కోల్పోయింది. దాన్ని సన్ గ్రూప్ దక్కించుకుని కొనసాగుతోంది.
ఇక ఇప్పుడు మరో రెండు కొత్త జట్లను ఇంట్రడ్యూస్ చేయనుంది బీసీసీఐ. అయితే ఇది విఫల ప్రయోగం. ఇది వరకూ ఒకసారి రెండు జట్లను తెచ్చారు. ఆ ఫార్మాటే సక్సెస్ కాలేదు. వివిధ కారణాలతో ఆ జట్ల రద్దు అయ్యాయి. అయినా ఇప్పుడు మరో రెండు జట్లను బీసీసీఐ పెంచడానికి కంకణం కట్టుకుంది.
అందుకు సంబంధించి బేస్ ప్రైస్ ను రెండు వేల కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. ఆ ధర నుంచి వేలం పాట మొదలవుతుంది. ప్రాంచైజ్ కావాలనుకున్న వాళ్లు.. వేలం పాడి కొనుక్కోవచ్చు. మరి ఆ ధర ప్రారంభమే రెండు వేల కోట్లు అంటే… వేలంలో ధర నాలుగు వేల కోట్ల రూపాయలకు కూడా చేరుతుందేమో! ప్రస్తుతం అన్ని వ్యాపారాలూ మందగమనంలోనే ఉన్నా.. ఐపీఎల్ జట్టుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా కన్షార్టియంగా ఏర్పడి అయినా కొన్ని సంస్థలు జాయింటుగా జట్టు కొనుగోలుకు రెడీ అవుతున్నాయట!
మొత్తానికి.. నాలుగు వందల కోట్ల రూపాయల సంచలన ధరతో మొదలైన ఐపీఎల్ జట్ల ప్రస్థానం ఇప్పుడు కనీసం ధర రెండు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నట్టుగా ఉంది. వాటి బ్రాండ్ వ్యాల్యూ ఇది. ఒకవేళ మొదట్లో ఐపీఎల్ జట్టును కొనుక్కొన్న వాళ్లు ఎవరైనా దాన్ని అమ్ముకోవాలన్నా.. ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలకు పై ధరే పలకవచ్చు. అదే స్థాయిలో ఉంటుందనేది కొత్త జట్ల ధరను బట్టి ఒక అంచనాకు రావొచ్చు. ఇన్నాళ్లూ ఏవైనా లాభాలు సంపాదించి ఉంటే, వాటిని బోనస్ అనుకున్నా, ఐపీఎల్ యాజమాన్యాలు తమ పెట్టుబడులకు అనేక రెట్ల డబ్బును సంపాదించినట్టే!