సినిమాలు ఆపట్లేదు.. గ్యాప్ మాత్రమే తీసుకుంటా

సినిమాలు, షూటింగ్స్ నుంచి కొన్నాళ్లు విరామం తీసుకుంటానని ప్రకటించింది సమంత. ఆ వెంటనే ఆమె వ్యక్తిగత జీవితంపై, కెరీర్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. తల్లి అయ్యేందుకే సమంత గ్యాప్ తీసుకుంటోందని కొందరు రాశారు. మరికొందరైతే…

సినిమాలు, షూటింగ్స్ నుంచి కొన్నాళ్లు విరామం తీసుకుంటానని ప్రకటించింది సమంత. ఆ వెంటనే ఆమె వ్యక్తిగత జీవితంపై, కెరీర్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. తల్లి అయ్యేందుకే సమంత గ్యాప్ తీసుకుంటోందని కొందరు రాశారు. మరికొందరైతే ఏకంగా ఆమె సినిమాల నుంచి తప్పుకుంటోందని, శాకుంతలం సినిమానే ఆమె చివరి సినిమా అంటూ కథనాలు అల్లేశారు. వీటిపై మరోసారి స్పందించింది.

“సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంటున్నాను. అయితే కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటానంతే. మళ్లీ తప్పకుండా వస్తాను. ఇప్పుడు సమంత 2.O చూస్తున్నారు. త్వరలోనే సమంత 3.O కూడా చూస్తారు. నేను తప్పకుండా నటిస్తాను.”

ఇలా తన కెరీర్ పై స్పష్టంగా ప్రకటన చేసింది సమంత. లాక్ డౌన్ వల్ల ఆల్రెడీ సమంత కెరీర్ లో గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ మరో గ్యాప్ తీసుకుంటానని, అది కూడా నెలల పాటు ఉంటుందని సమంత ప్రకటించింది. అదే సమయంలో మళ్లీ సినిమాల్లో నటిస్తానని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే కామెడీ చేయడం తనకు రాదని, అది చాలా కష్టమైన వ్యవహారమని అంటోంది సమంత.

“చాలామంది ఎమోషన్ పండించడం కష్టం అనుకుంటారు. కానీ నాకు తెలిసి కామెడీ పండించడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులకు ఇది ఇంకా కష్టం. కామెడీకి టైమింగ్ చాలా ముఖ్యం. అది లేకపోతే కామెడీ చేయలేం. అందుకే కామెడీ సీన్లలో నటించడం నాకు కష్టం అనిపిస్తుంది.”

ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలంతో పాటు ఓ తమిళ సినిమా ఉంది. శాకుంతలం షూటింగ్ పూర్తయింది. తమిళ సినిమా షూట్ త్వరలోనే ముగుస్తుంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్ తర్వాత ఆమె కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించదేమో.