పది రోజుల కిందట అద్భుత ఆట తీరుతో హారతులు అందుకున్న టీమిండియా మూడో టెస్టు తొలి రోజు ఆటతో ఆశ్చర్యాన్ని కలిగించింది. 78 పరుగులకే ఆలౌట్ కావడం ఒక ఎత్తు అయితే, అదే పిచ్ మీద ఇంగ్లండ్ ఓపెనర్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆడగలగడం మరో ఎత్తు. టీమిండియా చిత్తు చిత్తు గా ఆలౌట్ కాగానే, బహుశా విపరీతమైన బౌన్సీ పిచ్ ఏమో అని ప్రేక్షకులు కూడా విశ్లేషించుకున్నారు. అయితే ఒక్కసారి ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభం కాగానే.. కథ మారిపోయింది!
ఇంగ్లండ్ ఓపెనర్లు ఏమీ లెజెండరీ ప్లేయర్లు కాదు. వారిద్దరి అనుభవం, ఫామ్ రెండూ అంతంత మాత్రమే! అయితే.. గొప్ప గొప్ప టెస్టు బ్యాట్సెమెన్లుగా పేర్గాంచిన కొహ్లీ, పుజారా, రహనే వంటి వాళ్లు పట్టుమని పది బాళ్లను ఆడటం కష్టం అయిన చోట ఇంగ్లండ్ ఓపెనర్లు సులువుగా ఆడారు. ఫలితంగా తొలి రోజు టెస్టు మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ చేతిలోకి వెళ్లిపోయింది. పరిస్థితిని గమనిస్తే.. ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకుంటే అదే గొప్ప అయ్యేలా ఉంది!
పది రోజుల కిందట.. ఇక టెస్టు క్రికెట్ లో ఈ జట్టుదే ఆధిపత్యం అని అందరి చేతా అనిపించిన జట్టేనా ఇది? అనే ప్రశ్నను రేకెత్తించింది టీమిండియా. ప్రత్యేకించి కెప్టెన్ కొహ్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ స్టోరీ కొనసాగుతూ ఉండటం గమనార్హం. జట్టు విజయాలు సాధించినప్పుడు కొహ్లీ ఎలా ఆడినా సరిపోయింది, అయితే ఇలాంటి సందర్భాల్లో అన్నీ చర్చకు వస్తాయి. గత కొన్ని మ్యాచ్ లుగా కొహ్లీ ఆటతీరును గమనిస్తే.. ఇతడేనా సచిన్ టెండూల్కర్ రికార్డులను చెరిపేసేంత స్థాయికి వచ్చింది! అనే సందేహం కలగకమానదు.
అసలు వికెట్ల ముందు కొహ్లీ నిలుచుంటున్న చోటుకు, అతడు బంతిని ఆడే లైన్ కూ ఏ మాత్రం సంబంధం లేకుండాపోయిందంటూ గావస్కర్ విశ్లేషించారు గత మ్యాచ్ లోనే. తను నిలబడే చోటు నుంచి ఏ బంతులను అయితే ఆడకూడదో వాటినే ఆడుతూ కొహ్లీ కీపర్ కు క్యాచ్ లను అందిస్తున్నాడని ఆయన విశ్లేషించారు.
గత కొన్ని మ్యాచ్ లలో కొహ్లీ ఔట్ అయిన బంతులను గమనిస్తే.. వాటికి బౌలర్లు ఓ రేంజ్ ప్రణాళికలు ఏవీ వేసుకోనవసరం లేదని స్పష్టం అవుతోంది. ఫాస్ట్ పిచ్ ల మీద పేస్ బౌలర్లకు తేలికగా లభించే స్వింగ్ తోనే కొహ్లీని పెవిలియన్ కు పంపుతున్నారు బౌలర్లు. కొహ్లీ వికెట్ తీసిన ప్రతి సారీ.. అండర్సన్ రియాక్షన్ చూస్తే.. వికెట్ పడుతుందని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయనట్టుగా ఉంటుంది! ఈ బంతికే వికెట్ దక్కిందా.. అనేంత రేంజ్ లో అండర్సన్ రియాక్షన్ ఇస్తుంటాడు! బహుశా కొహ్లీ అంత దారుణంగా ఆడుతున్నాడు కాబోలు.
కేవలం కొహ్లీనే కాదు.. పుజారా, రహనేలు కూడా స్వింగ్ కు వికెట్లను ఇచ్చుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. రెండో మ్యాచ్ లో వీరు కాసేపు నిలదొక్కుకున్నారు కానీ, మూడో మ్యాచ్ లో మళ్లీ పాత కథే! మరి ప్రధాన బ్యాట్స్ మెన్ తాము ఆడాల్సిన లైన్ ఏమిటో కూడా అర్థం చేసుకోనట్టుగా… అప్పుడే జట్టులో స్థానం సంపాదించిన వారి రీతిలో వికెట్లను అప్పగించేస్తుంటే కోచ్ లు ఏం చేస్తున్నారో మరి!