నాలుగేళ్ల కిందట సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసుల నేపథ్యంలో ఈ వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో డ్రగ్స్ అమ్మకం-కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్న నివేదిక ఆధారంగా.. ఈ కేసులో విచారణ చేపట్టింది ఈడీ. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని ఆ కేసులో అప్పట్లో విచారణను ఎదుర్కొన్న సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది.
ఈడీ నోటీసులను ఎదుర్కొన్న సినిమా వాళ్ల జాబితాలో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్, పూరీ జగన్నాథ్, చార్మీ, రవితేజ, ముమైత్ ఖాన్, నందు, నవదీప్, తరుణ్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్-క్లబ్ అనే క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారట.
వీరిని పక్షం రోజుల పాటు ఈడీ విచారించనుందని తెలుస్తోంది. ముందుగా విచారణకు హాజరయ్యేది దర్శకుడు పూరీ జగన్నాథ్ గా తెలుస్తోంది. ఈ నెల 31న పూరీ ఈడీ ముందు హాజరవుతున్నారట. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కో రోజు వీరిని విచారిస్తారని సమాచారం.
డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో వీరిని సాక్షులుగానే పరిగణిస్తారట ప్రస్తుతానికి. కేసు విచారణ పూర్తయ్యే వరకూ వీరు సాక్షులు మాత్రమే అని సమాచారం. గతంలో ఈ కేసుపై విచారణ జరిపిన సిట్ కూడా వీరిని సాక్షులుగానే పరిగణించింది. డ్రగ్స్ వాడారా, లేదా అనే అంశంపై సిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ, డ్రగ్స్ సరఫరా మూలాలు, జాడలను తెలుసుకోవడానికి సిట్ వీరిని విచారించిందనే వార్తలు వచ్చాయి.
ఆ విచారణ జరిగినప్పుడు సినిమా వాళ్ల అరెస్టు ఊహాగానాలు కూడా రేగినప్పటికీ.. ఏ ఒక్కరి అరెస్టూ జరగలేదు. ఇప్పుడు డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో వీరు విచారణను ఎదుర్కొంటున్నారు.