టీడీపీకి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భారంగా మారారనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఇటీవల కాలంలో లోకేశ్ కంటే టీడీపీకి గుదిబండలా మరో వ్యక్తి తయారయ్యారనే ఆవేదన సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది. ఆ నాయకుడు సొంత పార్టీ వాడు కూడా కాదు. వైసీపీ రెబల్ ప్రజాప్రతినిధి కావడం గమనార్హం.
సదరు నేత నిర్వాకం, ఆయనకు టీడీపీ వెన్నుదన్నుగా నిలబడడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ బెయిల్‌పై చర్చ జరగడాన్ని టీడీపీ శ్రేణులు ఉదహరిస్తున్నాయి. జగన్ పరిపాలనలోని అప్రజాస్వామిక విధానాలు, అడ్డగోలు నిర్ణయాలపై కాకుండా, ముఖ్యమంత్రి బెయిల్ ఏమవుందోనని సర్వత్రా చర్చ జరగడం వల్ల టీడీపీకి నష్టమని భావిస్తున్నారు.
గత ఏప్రిల్‌లో జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ ముగింపు దశకు వచ్చే సరికి, వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని మరో పిటిషన్ తెరపైకి వచ్చింది. జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ అంశాలపై ఎల్లో మీడియాలో సహజంగానే పెద్ద ఎత్తున డిబేట్లు. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే అసాధారణ ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని కొన్ని వ్యవస్థలపై తనకున్న పట్టుతో కూలదోయాలనే కుట్రలకు టీడీపీ తెరలేపిందనే భావన ప్రజల్లో బలపడుతోంది.
జగన్ బెయిల్ రద్దయితే వైసీపీకే చెందిన మరొకరు ముఖ్యమంత్రి అవుతారు. జగన్‌ను తిరిగి జైలుకు పంపామన్న ఆనందం తప్ప టీడీపీకి వచ్చే లాభం ఏంటి? పైగా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్న జగన్‌ను జైలుకు పంపారన్న సానుభూతి జనం నుంచి వస్తుంది. ఇప్పటికే జగన్ బెయిల్‌పై పిటిషన్ల పుణ్యమా అని టీడీపీపై జనంలోకి నెగెటివ్ ప్రచారం వెళుతోంది. జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ, రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భయపడుతోందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో జగన్‌ను జైలుకు పంపడం వల్ల సంక్షేమ పథకాల అమలును అడ్డుకుని, ఆయనపై ప్రజాదరణ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోందనే ప్రచారం ఏపీ సమాజంలో జరిగేందుకు బెయిల్ పిటిషన్ బీజం వేసింది. ఇలాంటి ప్రచారం మరోసారి టీడీపీని అధికారానికి దూరం చేస్తుంది. జగన్ బెయిల్ రద్దయి జైలుకు వెళితే, ముఖ్యమంత్రిపై ప్రజల్లో సానుభూతి వస్తుందా? లేక వ్యతిరేకత వస్తుందా?… ఈ మాత్రం లాజిక్‌ను టీడీపీ నేతలు మిస్ అయితే ఎట్లా అనేది ఇప్పుడు ప్రధానంగా వినవస్తున్న ప్రశ్న. దీని వల్ల జగన్‌కు రాజకీయంగా లాభం చేసినట్టా? నష్టం చేసినట్టా?… టీడీపీ ట్రాక్ తప్పుతుందనేందుకు జగన్ బెయిల్ ఉదంతమే నిలువెత్తు నిదర్శనమనే అభిప్రాయాలున్నాయి.
జగన్ బెయిల్‌కు సంబంధించి సీబీఐకి లేని అభ్యంతరం టీడీపీకి, సదరు రెబల్ ప్రజాప్రతినిధికి ఎందుకనే ప్రశ్నలు, నిలదీతలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఇలాంటి అర్థంపర్థం లేని అంశాలను చేపట్టడం ద్వారా, ప్రాధాన్య అంశాలు మరుగున పడుతున్నాయని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులను చంద్రబాబు, లోకేశ్ గాలికొదిలేసి …జగన్ బెయిల్‌పై దృష్టి సారించడం ఏంటనే ప్రశ్నలు టీడీపీ శ్రేణుల నుంచే రావడం గమనార్హం. ఇదే జగన్ పాలనలోని లోపాలపై జనంలో చర్చ జరిగేలా కార్యాచరణ రూపొందించి ఉంటే రాజకీయంగా ప్రతిపక్షానికి లాభం వుండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అపర మేధావిగా పేరొందిన చంద్రబాబునాయుడు… కొడుకు పుణ్యమా అని సదరు రెబల్ ప్రజాప్రతినిధి ట్రాప్‌లో పడి, రాజకీయం గా నష్టపోతున్నారనే భావన టీడీపీ శ్రేణుల్లో పెరుగుతోంది. ఇంతా చేసి జగన్ బెయిల్ రద్దు అవుతుందా అంటే… చాలా తక్కువ అవకాశాలున్నాయనే అభిప్రాయాలు న్యాయవర్గాల నుంచి వినపడుతున్నాయి. ఇంత కాలం టీడీపీకి లోకేశ్ మాత్రమే భారమనుకుంటుంటే …ఇప్పుడు ఆయన కంటే మరొకరు, అది కూడా పార్టీయేతరుడు గుదిబండగా మారడం విషాదం.