కార్యక్రమం బాగుంది.. కలిసొచ్చేది ఎవరు?

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఇప్పటి వరకూ టీడీపీ చాలా కార్యక్రమాలను మొదలు పెట్టింది. అయితే వారి పోరాట పటిమ ఏంటో అదే రోజు తేలిపోయేది. టిడ్కో ఇళ్ల కేటాయింపుల కోసం…

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఇప్పటి వరకూ టీడీపీ చాలా కార్యక్రమాలను మొదలు పెట్టింది. అయితే వారి పోరాట పటిమ ఏంటో అదే రోజు తేలిపోయేది. టిడ్కో ఇళ్ల కేటాయింపుల కోసం ఆమధ్య టీడీపీ నాయకులు రోడ్డెక్కారు. దాని కాల వ్యవధి కేవలం మూడు రోజులు మాత్రమే. ఆ తర్వతా అందరూ ఇళ్లకు వెళ్లారు. 

జాబ్ క్యాలెండర్ కోసం నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. దాని కాల పరిమితి కేవలం ఒక్కరోజే. జిల్లా కేంద్రాల్లో అందరూ నిరసన ప్రదర్శనలు చేపట్టి, అనుకూల మీడియాలో అందంగా కనపడ్డామా లేదా అని చూసుకుని చాప చుట్టేశారు.

ఇటీవల నిరసన వారం పేరుతో కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమం పేరులోనే వారం ఉంది కానీ, అది జరిగింది ఒక్కరోజు మాత్రమే. వారం మొత్తం నిరసనలు చేపట్టి.. చివరి రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వాలనేది టీడీపీ అధినేతల ఆదేశం. అయితే కార్యకర్తలు మాత్రం మరోలా అర్థం చేసుకున్నారు. వారంలో ఒకరోజే నిరసన చేపట్టి, అదే రోజు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి సరిపెట్టుకున్నారు.

ఇక అమరావతి ఉద్యమం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అది కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లకు మాత్రమే పరిమితమైంది. చంద్రబాబు తన భార్య రెండు గాజులు దానం చేసి సైలెంట్ అయ్యారు, లోకేష్ పూర్తిగా మొహం చాటేశారు.

పెట్రోల్ ఉద్యమం ఎన్ని రోజులు..?

ఇక ఇప్పుడు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ రేట్లకు నిరసనగా టీడీపీ ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు బాబు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పెట్రోలుపై పన్నులు పెంచడం వల్లనే ధరలు పెరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు పై 31 శాతం, డీజిల్ పై 20 శాతానికి వ్యాట్ ను పెంచారని అంటున్నారు. ఈ నెల 28న నిరసన కార్యక్రమాలు చేపడతామని, జనాలకు అన్ని విషయాలు చెబుతామని అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ, ఇంతకీ నిరసనలు చేసేది ఎవరు?

యథావిధిగా చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉండి జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ తీసుకుని సాయంత్రానికి ఓ కునుకు వేసి లేచిన వెంటనే జూమ్ లో జనాల ముందుకొస్తారు. ఇక లోకేష్ ట్విట్టర్ లో పడుకుంటారు. 

నాలుగైదు అరువు తెచ్చుకున్న పంచ్ డైలాగులు ట్విట్టర్ లో పోస్ట్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లాబీయింగ్ తో బిజీగా ఉంటారు. టీడీపీలో ఓ మోస్తరు నాయకులంతా ఇళ్లకే పరిమితం అవుతారు. మరి రోడ్డెక్కి నిరసన చేసేది ఎవరు? టీడీపీ జెండా మోసేది ఎవరు? బహుశా.. జనాల్లేరు కాబట్టి, ఈసారి కూడా లోకేష్ మరోసారి అరెస్ట్ కోసం విశ్వప్రయత్నం చేస్తారేమో చూడాలి.

టీడీపీ చేస్తున్న ఆందోళనల్ని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదనేది వాస్తవం. అయితే చిత్తశుద్ధితో చేస్తే ఏదో ఒక రోజుకి వారి వెనక కూడా జనం నిలబడతారు, జనం లేకపోయినా కనీసం కార్యకర్తలయినా బయటకొస్తారు. కానీ అంతా కార్యకర్తలపైకి నెట్టేసి, చంద్రబాబు జూమ్ లో, చినబాబు ట్విట్టర్ లో రెస్ట్ తీసుకుంటే మాత్రం టీడీపీ పరిస్థితి మరీ పాతాళానికి పడిపోవడం ఖాయం.