స్వేచ్ఛ అంటే తనివి తీరా ఊపిరి తీసుకోవడం. స్వాతంత్ర్యం అంటే భయం లేకుండా, ఎదుటి వాళ్లకు హాని కలగకుండా మన కిష్టమైన పని చేయడం. స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి ప్రతీకగా అడవిని చెప్పుకోవచ్చు. అడవికి వెళితే మన ఊహలకు రెక్కలొస్తాయి. పక్షుల్లా ఆనందంగా విహరిస్తాం.
ఎత్తయిన కొండల్లో నిటారుగా ఆకాశాన్ని తాకుతున్నాయనే పించే వివిధ రకాల చెట్లు, లోయలు, నీటి ప్రవాహాల సవ్వడలు…ఇలా ప్రకృతి సోయగాల మధ్య మనిషి జీవించడానికి మించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఏముంటుంది?
అలాంటి అద్భుత వాతావరణంలో స్వాతంత్ర్య వేడుకలు జరిపితే…ఆ ఊహే ఎంతో మధురం. ఇక ఆ అనుభూతిని ఆస్వాదిస్తే… ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే తిరుపతి సమీపంలోని శేషాచలం అడవికి వెళ్లాల్సిందే. తిరుమల శ్రీవారు కొలువైన శేషాచలం అడవుల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి నేతృత్వంలో 75వ స్వాతంత్ర్య వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
శేషాచలం అడవిని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆదివాసీలైన సుబ్బరాయుడు (75), వెంకటస్వామి (68) చేతుల మీదుగా అడవిలోని అన్నదమ్ముల బండ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేశారు. దట్టమైన శేషాచలం అడవిలో అణువణువు ఈ ఆదివాసీలకు తెలుసు. ట్రెక్కింగ్‌కు వెళ్లే వారెవరైనా వీళ్ల మార్గదర్శకత్వంలో ముందుకెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో అడవిని కాపాడుతున్న ఆదివాసీ వృద్ధులను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్మానించారు.
అలాగే వారితో జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేయడం గౌరవంగా భావించామని అభినయ్‌రెడ్డి తెలిపారు. అన్నదమ్ముల బండ వద్దకు వెళ్లాలంటే దట్టమైన అడవిలో 14 కి.మీ ప్రయాణించాల్సి వుంటుంది. ఈ వేడుకలో మొజాయిక్ అడ్వెంచర్ కమ్యూన్ వ్యవస్థాపకుడు బాలు, తిరుపతి నగర పాలక స్టాండింగ్ కమిటీ సభ్యుడు గణేష్, తిరుమల వైస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రవీణ్ రాయల్, డిప్యూటీ మేయర్ అభినయ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.