ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబాటుకు గురి అయిన జిల్లాగా శ్రీకాకుళాన్ని చెప్పుకోవాలి. బ్రిటిష్ వారు నాలుక తిరగక ఈ ప్రాంతాన్ని చిక్కోలు అని పిలిచేవారు అంటారు. కాలక్రమంలో సిక్కోలు గా కూడా పిలుస్తున్నారు. సిక్కోలుకు ఆగస్ట్ 15 కి ఒక మంచి అనుబంధం ఉంది. అది ఏంటి అంటే ఇదే రోజున శ్రీకాకుళం జిల్లాగా ఆవిర్భవించింది.
శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్ట్ 15న ఏర్పడింది. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడేళ్ళకు అన్న మాట. అప్పటిదాకా ఈ జిల్లా విశాఖలోనే అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. అయితే పెద్ద జిల్లాతో పాలన సాఫీగా సాగడంలేదని శ్రీకాకుళాన్ని వేరుగా చేస్తూ జిల్లా హోదా ఇచ్చేశారు.
జిల్లాగా ఏర్పడిన తరువాత కొంత మేర అభివృద్ధి సాగినా ఆశించిన మేరకు ఈ రోజుకూ జరగలేదు అన్న బాధ అయితే జిల్లా వాసులలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రేపటి వైపు ఆశగా చూస్తూ అడుగులు వేయడం జిల్లా వాసులకు ఉన్న గుండె నిబ్బరానికి తార్కాణం.
వైసీపీ ఏలుబడిలో సాగునీటి ప్రాజెక్టులకు కదలిక వచ్చింది. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలన్న ప్రణాళిక కూడా ఉంది. దాంతో భవిష్యత్తుపైన కొండంత నమ్మకం పెట్టుకుని జెండా పండుగతో పాటు జిల్లా పండుగను కూడా సిక్కోలు జనాలు అనందంగా జరుపుకుంటున్నారు.