ఓవైపు అంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉన్నారు. రోడ్లపై రద్దీ తక్కువగా ఉంది. అలాంటి టైమ్ లో రోడ్డుపై ఓ యువతిని ఆపాడు దుండగుడు. తన బైక్ ఎక్కాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించింది. అంతే వెంట తెచ్చుకున్న కత్తితో నడిరోడ్డుపై ఆమెను పొడిచి హత్య చేశాడు. గుంటూరులో జరిగింది ఈ దారుణం.
ఇంతకీ ఏం జరిగింది..?
ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది రమ్య. ఎప్పట్లానే కాకాని రోడ్డులో వెళ్తోంది. అంతలోనే ఓ యువకుడు ఆమెను ఆపాడు. తన బైక్ ఎక్కాల్సిందిగా కోరాడు. దానికి రమ్య నిరాకరించింది. ఇద్దరి మధ్య దాదాపు 7-8 నిమిషాలు వాగ్వాదం జరిగింది. ఆ వెంటనే కత్తితో రమ్యను దారుణంగా పొడిచి చంపేశాడు అగంతకుడు. ఈ మొత్తం వ్యవహారం దగ్గర్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది.
దుండగుడి దాడితో రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్య కేసులో శశికృష్ణ అనే యువకుడిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మరికొన్ని గంటల్లో అతడ్ని అరెస్ట్ చేస్తామని అంటున్నారు. మరోవైపు మృతిరాలి చెల్లెలు ఇచ్చే సమాచారాన్ని కూడా క్రోడీకరిస్తున్నారు.
కీలకంగా మారిన సెల్ ఫోన్
ఘటన స్థలం నుంచి రమ్య సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ కాల్ డేటా చెక్ చేస్తే కీలకమైన ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆమె సెల్ ను పోలీసులు ఓపెన్ చేయలేకపోయారు. అది ఓపెన్ అయితే ఈ కేసును క్షణాల్లో ఛేదిస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు బృందాలుగా ఏర్పడి నిందుతుడి కోసం గాలిస్తున్నారు.
స్పందించిన ప్రభుత్వం.. తక్షణ సాయం
ఘటన జరిగిన వెంటనే హోం మంత్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. బాధ్యులను చట్టం ముందు నిలబెడతానని, మృతురాలని కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని ట్వీట్ చేశారు. తక్షణ సాయం కింద 10 లక్షల రూపాయలు ప్రకటించారు.