రాజధాని అమరావతే…హైకోర్టు మాత్రం కర్నూలులో

ఏపీ బీజేపీ రాజధాని వ్యవహారంలో తన విధానమేంటో స్పష్టం చేసింది. అటు జగన్ విధానానికి మద్దతు ఇవ్వడంలేదు. ఇటు చంద్రబాబు విధానానికి మద్దతు ఇవ్వడంలేదు. జగన్ విధానం మూడు రాజధానులు. అంటే పరిపాలన రాజధాని…

ఏపీ బీజేపీ రాజధాని వ్యవహారంలో తన విధానమేంటో స్పష్టం చేసింది. అటు జగన్ విధానానికి మద్దతు ఇవ్వడంలేదు. ఇటు చంద్రబాబు విధానానికి మద్దతు ఇవ్వడంలేదు. జగన్ విధానం మూడు రాజధానులు. అంటే పరిపాలన రాజధాని విశాఖలో, న్యాయ రాజధాని కర్నూలులో, శాసన రాజధాని అమరావతిలో. 

చంద్రబాబు విధానం మూడూ అమరావతిలోనే. కానీ వీళ్లిద్దరికీ భిన్నంగా బీజేపీ విధానం ఉంది. ఇప్పటివరకూ బీజేపీ అమరావతి ఏకైక రాజధానికి మద్దతు ఇస్తున్నట్టు చెబుతూ వచ్చింది. అటు కేంద్ర పెద్దగా మాత్రం రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమంటూ ప్రకటిస్తూ వచ్చింది.

ఇలా రెండు పడవల మీద కాళ్లు వేస్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. బీజేపీ అమరావతికి మద్దతు తెలుపుతున్నా ఆ పార్టీపై ఒక రకమైన భావన రైతుల్లో ఏర్పడింది. ఒకసారేమో ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తారు. మరోసారేమో రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అంటారు. 

ఈ మధ్యేమో అమరావతి డిమాండుకే కమలనాథులు జై కొడుతున్నారు. న్యాయస్థానం టు దేవస్ధానం యాత్ర సందర్భంగా అమరావతికే బీజేపీకి జై కొట్టింది. తాజాగా అమరావతి టు అరసవల్లికి మొదలైన పాదయాత్రకు కూడా బీజేపీ జై కొట్టింది. అయితే తాజాగా బీజేపీ రాయలసీమ సమావేశంలో హై కోర్టును కర్నూలులోని పెట్టాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది.

డిమాండుతో సరిపెట్టుకోకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయించే బాధ్యత తామే తీసుకుంటామని కూడా బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనలో మాట్లాడుతూ విశాఖను ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగితే నాయకుల నుంచి సమాధానం లేదు. అసలు రాజధానుల ఏర్పాటు తమ పరిధిలో లేదని కేంద్రం రెండుసార్లు హైకోర్టుకిచ్చిన అఫిడవిట్లలోనే స్పష్టం చేసింది. రాజధాని ఏర్పాటు అన్నది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమే అని చెప్పిన విషయాన్ని బీజేపీ నేతలు మరచిపోయినట్లున్నారు.

జనాల ఆకాంక్షల ప్రకారం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారా అంటే అదీలేదు. ఏకైక రాజధాని అంటేనే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం అన్నీ అమరావతిలోనే ఉంచాలని కదా అర్ధం. మరి ఇపుడు కర్నూలులో హైకోర్టు ఉండాలని డిమాండ్ చేయటంలో అర్ధమేంటి? దీని అర్ధమేమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలోనే కర్నూలులో హైకోర్టు గురించి హామీ ఇచ్చింది.

ఈ విషయాన్ని మాజీ మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో గుర్తు చేసారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలంటూ.. న్యాయవాదులు ఈరోజు ఆందోళనలు చేపట్టారు. జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ద్విచక్రవాహన.. ర్యాలీ చేపట్టారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలుకు తరలించాలని.. డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.