ఈ రోజుల్లో ఏ సినిమాకు అయినా శాటిలైట్ రైట్స్ చాలా కీలకం. భారీ బడ్జెట్ సినిమాల ఖర్చు తడిసిమోపెడవుతుంది. అందులో ప్రధానంగా తారల పారితోషికమే ఎక్కువ! మేకింగ్ ఖర్చులు ఏ మూలకో పోతున్నాయి. హీరోల, హీరోయిన్లు రెమ్యూనిరేషన్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినప్పటికీ.. సక్సెస్ రేటు మాత్రం అంతంత మాత్రమే! డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను భారీ రేటుకు అమ్మడం, ఆ తర్వాత పంచాయతీలు, తిరిగి చెల్లింపులు అంతా వేరే కథ!
ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలకు నమ్మకంగా ఎక్కడైనా కాస్త ముడుతుందంటే అది కేవలం డిజిటల్, ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో మాత్రమే! సినీ నిర్మాతలకు ఇవి కలిసి వస్తున్నాయి. అది కూడా ఈ డీల్స్ సినిమా విడుదలకు ముందే తెగితే ఫర్వాలేదు. అదే విడుదలయ్యాకా.. అయితే వేరే కథ! ఈ పరిస్థితుల్లో వస్తున్న మరో భారీ సినిమా పొన్నియన్ సెల్వన్.
సరైన విజయం రుచి ఎరిగి దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత మణిరత్నం నుంచి వస్తున్న భారీ సినిమా ఇది. ప్రధానంగా తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాపై ఆసక్తి ఉంది. మణిరత్నం సినిమాలకు హిందీ నుంచి కొంత ఆసక్తి ఉండనే ఉంటుంది. మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ పేరుకు గుర్తింపు ఉంది. అందులోనూ బోలెడంతమంది స్టార్లు. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నట్టే! ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను అమేజాన్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ డీల్ విలువ 125 కోట్ల రూపాయలు అని టాక్!
మరి ఇది భారీ మొత్తమే. అయితే ఈ సినిమా రెండు వెర్షన్లకు గానూ ఈ డీల్ కుదిరిందని, రెండో వెర్షన్ల విడుదలకు గానూ అమేజాన్ ఈ మొత్తాన్ని చెల్లిస్తుందని సమాచారం. అంటే ఒక్కో పార్ట్ కు 60 కోట్ల రూపాయల స్థాయి. మరి ఎలా చూసినా.. 125 కోట్ల రూపాయలంటే భారీ రేటే. ఈ మధ్యనే అక్షయ్ కుమార్ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ డీల్ 140 కోట్ల రూపాయల స్థాయిలో పలికింది.
అయితే పొన్నియన్ సెల్వన్ బడ్జెట్ భారీగా ఉందంటున్నారు. ఈ సినిమా రెండు వెర్షన్లకూ కలిపి లైకా సంస్థ ఐదొందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందట! ఇలా చూస్తే.. ఓటీటీ రేటు కాస్త తక్కువే! అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ల ప్రసార హక్కులను సన్ సంస్థ భారీ ధరకు పొందిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా డిజిటల్ మాధ్యమాల నుంచినే పెట్టుబడి ఖర్చుల్లో యాభై శాతం వరకూ లైకా తిరిగి రాబట్టుకుంటున్నట్టుగా ఉంది. మరి మిగతా మొత్తాన్ని రాబట్టుకోవాలంటే థియేటర్ల వద్ద సానుకూల స్పందనే రావాలి!