ఈ ప‌ని పూర్తైతే జ‌గ‌న్ ఖ్యాతి చిర‌కాలం!

ఊహించ‌లేదెవ‌రూ.. అనంత‌పురం జిల్లాలో చెరువులు ఈ స్థాయిలో నిండుతాయ‌ని! భారీ వ‌ర్షాలు రావ‌డం రావ‌డం క‌ల‌, ఆ చెరువులు నిండటం అనేది ఇక సాకార‌మ‌య్యే స్వ‌ప్న‌మ‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు! ఉమ్మ‌డి ఏపీలోనే అతి పెద్ద…

ఊహించ‌లేదెవ‌రూ.. అనంత‌పురం జిల్లాలో చెరువులు ఈ స్థాయిలో నిండుతాయ‌ని! భారీ వ‌ర్షాలు రావ‌డం రావ‌డం క‌ల‌, ఆ చెరువులు నిండటం అనేది ఇక సాకార‌మ‌య్యే స్వ‌ప్న‌మ‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు! ఉమ్మ‌డి ఏపీలోనే అతి పెద్ద చెరువుల్లో తొలి వ‌ర‌స‌లో ఉంటాయి అనంత‌పురం జిల్లాలోని చెరువులు. విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్య కాలంలో నాటి రాజులు త‌వ్వించిన చెరువులు వంద‌ల, వేల ఎక‌రాల స్థాయిల్లో ఉంటాయి.

అనంత‌పురం జిల్లాలోని బుక్క‌ప‌ట్నం చెరువు, ధ‌ర్మ‌వ‌రం చెరువులు అతి భారీ స్థాయివి. ఆ చెరువుల్లోకి నీళ్లు రావ‌డం అంటే.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు పెద్ద విశేషం! స్థానికంగా ఒక‌ప్పుడు బాగా పారిన యేర్ల‌కు అనుసంధానంగా ఆ చెరువుల నిర్మాణం జ‌రిగిన తీరు అబ్బుర ప‌రుస్తుంది. నాటికే అలాంటి ఇంజ‌నీరింగ్ టెక్నిక్స్ తో చెరువులు త‌వ్వారంటే ఔరా అనిపించ‌క‌మాన‌దు. 20 యేళ్ల కింద‌ట వ‌ర‌కూ కూడా ప్ర‌తి సంవ‌త్స‌రం ఏదో ఒక్క‌సారి అయినా భారీ వ‌ర్షం వ‌చ్చేది. వంక‌లు సాగేవి, చెరువులు నిండేవి. ఒక్కో వంక‌కు ప‌క్క‌గా కొన్ని ప‌దుల సంఖ్య‌లో చెరువులు ఉంటాయి.

ఆ వంక‌లు ముందుకు సాగుతూనే, కొద్ది మేర ప‌క్క‌కు కాలువ‌ల ద్వారా వెళ్లే నీళ్ల‌తో చెరువులు నిండేవి. ప్ర‌తి చెరువుకూ, వంక‌తో అనుసంధాన‌మైన కాలువ, ఆ చెరువులు నిండితే మ‌ర‌వ నీళ్లు తిరిగి వంక‌లోకే వెళ్లే ఏర్పాట్లు.. నిజంగా అద్భుత‌మైన నిర్మాణాలు అవి! శ‌తాబ్దాల నుంచి ఆ చెరువులు, వాటి నిర్మాణాలు, వాటికి నీళ్ల‌ను తీసుకెళ్లే కాలువ‌లు చెక్కు చెద‌ర‌లేదు. అయితే వ‌ర్షాలు మాత్రం మొహం చాటేశాయి.

గ‌త 20 యేళ్ల‌లో భారీ వ‌ర్షాలు కురిసిన దాఖ‌లాలు త‌క్కువ‌. అయితే గ‌త యేడాది మాత్ర‌మే మిన‌హాయింపు. ఒక‌ప్ప‌టి వంక‌లు, వాగులు గ‌త ఏడాది వ‌ర్షాకాలంలో పొంగి పొర్లాయి. ఇదే స‌మ‌యంలో.. హంద్రీనీవా కాలువ‌ల ద్వారా పెద్ద పెద్ద చెరువులు నిండుతున్నాయి. గ‌త ఐదారు నెల‌లుగా హంద్రీనీవా కాలువ‌ల ద్వారా నీళ్లు సాగుతూనే ఉన్నాయి.

అనంత‌పురం జిల్లాలోనే కొన్ని ప‌దుల సంఖ్య‌లో చెరువులు నిండాయి! అవిగాక‌.. హంద్రీనీవాలో భాగంగా నిర్మించిన రెండు రిజ‌ర్వాయ‌ర్లు కూడా జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. రామ‌సాగ‌రం డ్యామ్, గొల్ల‌ప‌ల్లి డ్యామ్ వంటివి రెండు టీఎంసీల స్థాయివి. వాటి ద్వారా అటు హిందూపురం వ‌ర‌కూ, ఇటు కర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లోని గ్రామాల వ‌ర‌కూ తాగునీరు అందే అవ‌కాశం కూడా ఉంది. ఇలా అనంత‌పురం జిల్లాలో మెజారిటీ భాగానికి హంద్రీనీవా వ‌ర‌ప్ర‌దంగా మారింది. ధ‌ర్మ‌వ‌రం, బుక్క‌ప‌ట్నం చెరువులు నిండుకుండ‌ల్లా ఉన్నాయి. చుట్టుప‌క్క‌ల కొన్ని ప‌దుల గ్రామాల‌కు ఉన్న చెరువుల‌న్నీ దాదాపు నిండుగా ఉన్నాయి!

అనంత‌పురం దాటి.. చిత్తూరు జిల్లా దిశ‌గా హంద్రీనీవా నీళ్లు సాగుతున్నాయి. ఆ జిల్లాలోనూ చాలా వ‌ర‌కూ నీటి క‌రువును నివారించే అవ‌కాశం ఉంది హంద్రీనీవా కాలువ‌ల ద్వారా. అటు త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల వ‌ర‌కూ హంద్రీనీవా కాలువ‌లు నిర్మితం అయ్యాయి. నిజంగా హంద్రీనీవా ప్రాజెక్టు అనేది అనంత‌పురం, చిత్తూరు జిల్లాల‌కు వ‌ర‌ప్ర‌దం. మ‌రోవైపు క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాల‌కూ వేరే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జ‌ల‌క‌ళ ల‌భించింది. ఈ ప్రాజెక్టుల విష‌యంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖర రెడ్డి చొర‌వ‌ను ఎంత పొగిడినా త‌క్కువే!

ఎవ‌రేం మాట్లాడినా.. నిస్సందేహంగా రాయ‌ల‌సీమ పాలిట అభినవ కాట‌న్ దొర వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి. వైఎస్ఆర్ గ‌నుక చొర‌వ చూప‌క‌పోతే హంద్రీనీవా ఊసే లేదు. ఎన్టీఆర్ కాలంలో వేసిన శిలాప‌ల‌కాలే ఇప్ప‌టికీ వెక్కిరిస్తూ ఉండేవి. చంద్ర‌బాబు తొమ్మిదేళ్ల పాల‌న‌లో హంద్రీనీవా అణువంతైనా క‌ద‌ల్లేదు. అలాంటి దుర్మార్గ‌పు పాల‌న అది. జ‌ల‌య‌జ్ఞంలో భాగంగా హంద్రీనీవా ద్వారా వైఎస్ రాయ‌ల‌సీమకు అద్భుతాలు చేసి పెట్టారు.

అయితే.. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. ఆ మిగిలిన ప‌నికి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గ‌త యేడాది భారీ వ‌ర‌ద‌ల‌తో కొన్ని వంద‌ల టీఎంసీల నీళ్లు స‌ముద్రం పాల‌య్యాయి. అలాంటి వ‌ర‌ద నీటిని మ‌రింత‌గా రాయ‌ల‌సీమ‌కు మ‌ళ్లించే ప‌నికి జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌రీ సామ‌ర్థ్యం రెట్టింపు చేయ‌డం ఇందులో అతి కీల‌క‌మైన‌ది. అది వీలైనంత త్వ‌ర‌గా పూర్తి అయితే.. సీమ‌లో సాగే కాలువ‌ల విస్తీర్ణం పెంపు ముందు ముందు అయినా చేసుకోవ‌చ్చు.

వ‌ర‌ద వ‌చ్చే స‌మ‌యంలో ఎక్కువ‌గా నీటిని తీసుకోగ‌లిగిన‌ట్టుగా అయితే.. ఇప్ప‌టికే ఉన్న డిస్ట్రిబ్యూష‌న‌రీ కాలువ‌ల ద్వారా నీటిని త‌రిలించే అవ‌కాశాలున్నాయి. ముందు హెడ్ రెగ్యులేట‌రీ సామ‌ర్థ్యం పెంచితే, కాలువ‌ల విస్తీర్ణం ముందు ముందు అయినా పెంచుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ ఒక్క ప‌నీ వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేస్తే.. జ‌గ‌న్ ఖ్యాతి చిర‌స్మ‌ర‌ణీయం అవుతుంది. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా వైఎస్ ఎలా ప్రాతఃస్మ‌ర‌ణీయుడు అయ్యారో.. ఇప్పుడు సీమ ప్రాజెక్టుల‌కు నీటి వ‌న‌రును రెట్టింపు చేస్తే .. జ‌గ‌న్ అంతే స్థాయి ఖ్యాతిని నిస్సందేహంగా సంపాదించుకుంటారు.

చిన్న పిల్లాడిలా మహేష్ బాబు అల్లరి