కామెడీ ఆఫ్ ఎర్రర్స్

ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే కలిగే అనర్ధాలేమిటో చాలా సంవత్సరాల క్రితమే రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గారు 'అనువాద సమస్యలు' అనే పుస్తకంలో తెలిపారు. సీనియర్ పాత్రికేయులు…

ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే కలిగే అనర్ధాలేమిటో చాలా సంవత్సరాల క్రితమే రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గారు 'అనువాద సమస్యలు' అనే పుస్తకంలో తెలిపారు. సీనియర్ పాత్రికేయులు కొందరు ఇందుకు సంబంధించి ఇంకా పలు ఉదాహరణలు చెబుతుంటారు.

వాక్యాలు సరే.. వేరే ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖుల పేర్లను సైతం తెలుగులో రాసేటప్పుడు పాత్రికేయులు కొందరు తప్పులో కాలేస్తుంటారు. ఈనాడుతో సహా దాదాపుగా తెలుగు దినపత్రికలలో ఇటువంటి పొరపాట్లు చాలాకాలంగా దొర్లుతున్నాయి. ఈ రోజు (జూలై 14) తెలుగు పత్రికలలో ఓ క్రీడా వార్తకు పెట్టిన హెడ్డింగ్ చూశాక ఇది రాయకుండా ఉండలేకపోయా. 

1983 లో భారత్ కు క్రికెట్ లో ప్రపంచ కప్ సాధించి పెట్టిన జట్టు సభ్యుడైన 'యశ్ పల్ శర్మ' నిన్న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 'యశ్ పల్ శర్మ' పేరును తెలుగు పత్రికలు చాలా కాలం నుంచి యశ్ పాల్ శర్మగా రాస్తున్నాయి. ఈ రోజు కూడా అలాగే రాశాయి. 'పల్' కి, 'పాల్' కి చాలా తేడా ఉంది. పైగా పాల్ తర్వాత శర్మ అని రాస్తారు. చదివే వారికి అతని పేరులో రెండు రకాల మతాలకు సంబంధించిన పదాలు ఉండటంతో ఒకింత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కానీ, తెలుగు పత్రికలలో పనిచేసే క్రీడా పాత్రికేయులకు ఈ అనుమానం రాకపోవడం ఆశ్చర్యమే.  

సచిన్ కంటే ముందు భారత్ క్రికెట్ దేవుడు – సునీల్ గవాస్కర్ ను 'ఈనాడు' మాత్రమే 'గావస్కర్' అని రాస్తోంది. అతణ్ణి గవాస్కర్  అనకూడదు.. గావస్కర్ అనే అనాలని స్వయంగా గావస్కర్ చెప్పినా.. ఇప్పుడు ఎవ్వరూ వినిపించుకోకపోవచ్చు. 

చాలా కాలం క్రితం భారత టెన్నిస్ లో 'నందన్ బల్' అనే జాతీయ ఆటగాడు ఉండేవాడు. అతని పేరును 'నందన్ బాల్' అని తెలుగు పత్రికలు రాసేవి. 'బల్' ని బాల్ గా రాయడం సబబు కాదు కదా?! కొన్నేళ్ల క్రితం వరకు రంజీ ట్రోఫీ మ్యాచ్ ల మాదిరిగా దేవ్ ధర్ టోర్నమెంట్ ను నిర్వహించేవారు. తెలుగు పత్రికలన్నీ డియోడర్ ట్రోఫి అని రాసేవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న 'సునీల్ దేవ్ ధర్' ను చాలా తెలుగు పత్రికలు సునీల్ దియోధర్ అని రాస్తుంటాయి. హిందీ హీరో ధర్మేంద్ర కుమారుడైన సన్నీదేవల్ ను కూడా 'సన్నీ డియోల్' అని తెలుగులో రాస్తుంటారు. 

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుముద్ బెన్ జోషి గవర్నర్ గా వచ్చారు. తెలుగు పత్రికలన్నీ ఆమెను 'కుమారి కుముద్ బెన్ జోషి' అని వ్యవహరిస్తుండేవి. కుముద్ బెన్ గారికి వివాహం కాలేదేమో అని చాలామంది అనుకొనేవారు. అయితే, ఆమెకు వివాహం అయిందని.. ఆమె భర్త పేరు మణిశంకర జోషి అని తర్వాత తెలిసింది. మరి ఆమె 'కుమారి' ఎలా అయింది? 

జర్మనీ వంటి యూరప్ దేశాలలో మహిళలు తమ వైవాహిక స్థితిని తెలియపరచడానికి ఇష్టపడరు. అందువల్ల.. 16 సంవత్సరాల వయస్సు వరకు బాలికలను అడ్రస్ చేసే సమయంలో పేరు ముందు 'ఫ్రాలైన్' అనే పదాన్ని జోడిస్తారు. యుక్త వయస్సు దాటిన మహిళలను వారి మేరేజ్ స్టేటస్ తో సంబంధం లేకుండా పేరు ముందు 'frau' అనే పదాన్ని తగిలించి పిలుస్తుంటారు. 

ఇంగ్లాండ్ లో కూడా మహిళల వైవాహిక స్టేటస్ తెలియనప్పుడు, లేదా తెలియజేయడానికి వారికి ఇష్టం లేనప్పుడు పేరు ముందు Ms (క్యాపిటల్ ఎం తర్వాత స్మాల్ 'ఎస్') అని రాస్తారు. పిలవడం మిజ్  (మిస్ కాదు) అని పిలుస్తారు. ఇది తెలియక కొందరు తెలుగు పాత్రికేయులు ఇంగ్లీష్ లో కుముద్ బెన్ గారి పేరు ముందు Ms అని ఉండటంతో.. అది మిస్ అనే పదంగా భావించుకొని ఆమెకు పెళ్లి కాలేదనే భావనతో రొటీన్ గా రాసేయడంతో.. పెళ్లయిన కుముద్ బెన్ జోషి గారు.. తెలుగు ప్రజలకు 'కుమారి' గానే దాదాపు ఐదేళ్ల పాటు ఉండిపోయారు. 

ఇక.. రష్యన్,  ఫ్రెంచ్ రచయితల పేర్లను తెలుగులో వ్రాసేటప్పుడు ఘోరంగా ఖూనీ చేసిన అనువాదకులున్నారు. అంతెందుకు.. ప్రపంచ యువత అమితంగా ఆరాధించే 'చె గువెరా' పేరును 'చేగువేరా' అని కొందరు ప్రముఖ సంపాదకులు సైతం అతని పేరును నాలుగు అక్షరాలలో కలిపి రాయడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. 

పేర్లను తెలుగులో కొంచం అటుఇటుగా రాసినా నష్టం లేదని వాదించేవారు ఉండొచ్చు. కానీ, కొన్ని పదాలు పలికేటప్పుడు పంటికింద రాళ్లు పడిన చందంగా ఉంటాయి. బల్ ని.. బాల్ అని, పల్ ని పాల్ అని రాస్తే బాగుంటుందా? 'వాటీజ్ ఇన్ ఎ నేమ్' అంటాడు షేక్స్పియర్. 'పేరులోనే ఉన్నది పెన్నిధి' అంటారు భారతీయులు. అంచేత, ప్రముఖుల పేర్లను తెలుగులో రాసేటప్పుడు తెలుగు పాత్రికేయులు, రచయితలు తగిన జాగ్రత్తలు తీసుకొని రాస్తే బాగుంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో కామెడీ ఆఫ్ ఎర్రర్స్ క్రియేట్ అవుతాయి. 

(ఈ రోజు తెలుగు దినపత్రికలన్నీ క్రికెటర్ యశ్ పల్ మృతి వార్తలో 'యశ్ పాల్ శర్మ' అని రాయడం చూశాక)

– విక్రమ్ పూల