పిల్లి మెడలో గంట ఎవరు కడతారనేది సామెత. మొన్నటివరకు మాజీ మంత్రి నారాయణ వ్యవహారం ఇలానే సాగింది. రాజధాని భూదందాలో నారాయణ కీలక వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసు. అమరావతి భూ కుంభకోణం మొత్తం నారాయణ కనుసన్నల్లోనే జరిగిందనే విషయం బహిరంగ రహస్యం.
కానీ ఇప్పటివరకు అధికారులు నారాయణను కార్నర్ చేయలేకపోయారు. దీన్ని అలుసుగా తీసుకొని లోకేష్ తో సహా, ఇతర నేతలంతా నానా మాటలన్నారు. ఒక్క ఆధారం చూపించండి అంటూ రెచ్చిపోయారు.
ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. మాజీ మంత్రి నారాయణ ఇక ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. రాజధాని భూ ఆక్రమణలపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు.. అత్యంత కీలకమైన సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వాగ్మూలాన్ని తీసుకున్నారు. విచారణలో భాగంగా శ్రీధర్ కీలకమైన విషయాల్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది.
భూదందాకు పెట్టిన అందమైన పేరు ల్యాండ్ పూలింగ్. ఈ పూలింగ్ వెనక జరిగిన మతలబులన్నింటినీ శ్రీధర్ బయటపెట్టారు. ల్యాండ్ పూలింగ్ జరగడానికి ఏడాది ముందే తుళ్లూరు మండలంలోని భూసర్వే రికార్డులన్నింటినీ నారాయణ రహస్యంగా తెప్పించుకున్నారట. ఆ తర్వాత కొద్ది నెలలకే ల్యాండ్ పూలింగ్ అంశం తెరపైకి వచ్చిందని శ్రీధర్ తెలిపారు.
ల్యాండ్ పూలింగ్ అనేది ఏపీ ఎస్సైన్డ్ యాక్ట్-1977కు విరుద్ధమని శ్రీధర్, నారాయణకు అప్పుడే చెప్పారట. కానీ నారాయణ ఆ విషయాన్ని పట్టించుకోలేదని, పూలింగ్ పేరిట వేల ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారని శ్రీధర్ బయటపెట్టారు.
ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు సీక్రెట్ గా తీసుకెళ్లిన రికార్డుల్ని తిరిగి ఆఫీస్ లో పెట్టలేదని కూడా శ్రీధర్ తెలిపారు. రెవెన్యూ ఆఫీసుల్లో ఉండాల్సిన రికార్డుల్లో నారాయణ, మరో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్పుచేర్పులు చేయించారని శ్రీధర్ బయటపెట్టారు.
శ్రీధర్ చెప్పిన విషయాల్ని సీఐడీ అధికారులు రికార్డు చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి విషయం నారాయణ చుట్టూనే తిరిగింది. భూదందాకు కర్త-కర్మ-క్రియ మొత్తం నారాయణ అని చెప్పారట శ్రీధర్. దీంతో నారాయణను విచారించేందుకు ఏపీ సీఐడీ, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.
అలా ఇన్నాళ్లకు నారాయణ కార్నర్ అయ్యారు. సీఆర్డీఏ మాజీ కమిషనర్ శ్రీధర్ అన్నీ బయటపెట్టడంతో, ఏ క్షణమైనా నారాయణ అరెస్ట్ తప్పదంటున్నారు అదే కనుక జరిగితే ఆ సెగ నేరుగా చంద్రబాబుకు తగులుతుంది. ఎందుకంటే, నారాయణ ఇవన్నీ చేసింది బాబు కోసమే కదా. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పట్నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు నారాయణ దూరంగా జరిగిన విషయం తెలిసిందే.