బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో. ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తూన్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోంది. ఈ లోగా సినిమా కు సంబంధించి రెండు సంఘటనలు జరిగాయి. ఒకటి ప్రచారానికి శ్రీకారం చుట్టడం. రెండవది సినిమాకు సంగీతం అందిస్తున్న శంకర్-ఎహసాన్-లాయ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం.
ప్రచారం సంగతి చూస్తే, వాస్తవం మాట్లాడుకుంటే, వదిలిన రెండు స్టిల్స్ పెద్దగా జనాలకు పట్టలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ సంగతి అలా వుంచితే న్యూట్రల్ ఆడియన్స్ కు అహో అనిపించాలి. అలాంటిది జరగలేదు. సినిమా మీద ఆసక్తి పెంచే కథనాలు ఇప్పటి వరకు రావడం లేదు. యూనిట్ చూస్తే ముంబాయి టీమ్ ను సినిమా ప్రచారానికి నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.
కానీ వాళ్ల స్టిల్స్ సెలక్షన్, వాళ్లు స్టిల్స్ లాంచ్ చేసే పద్దతి టాలీవుడ్ వ్యవహారాలకు చాలా భిన్నంగా వుంటోంది. అందువల్ల సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదన్నది ట్రేడ్ సర్కిళ్ల బోగట్జా. అయితే ఇంకా చాలా టైమ్ వుంది కాబట్టి, ప్రచారం సర్దుకుంటుంది అని అనుకోవచ్చు.
ఇక రెండో సంగతి.మ్యూజిక్ డైరక్టర్లు తప్పుకొవడం. ఈ విషయం ఇవ్వాళ బయటకు వచ్చినా, ఆరునెలలుగా లోలోపల రగులుతోన్నట్లు తెలుస్తోంది. శంకర్-ఎహసాన్-లాయ్ కలిసి మూడు పాటలు చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఇంగ్లీష్ సాంగ్. ఇవేవీ తెలుగు శ్రోతలను ఇంప్రెస్ చేసేవిగా లేవని యూనిట్ భావించినట్లు తెలుస్తోంది.
దాంతో మన నేటివిటీ వుండేలా, వేరే మ్యూజిక్ డైరక్టర్లతో మరో ఒకటి రెండు పాటలు చేయిస్తామనే ప్రతిపాదనను శంకర్ అండ్ కో ముందు వుంచారు. కానీ దానికి వారు అంగీకరించలేదు. దాంతో ఆ ఇష్యూ అలా నలిగి నలిగి ఇక్కడిదాకా వచ్చింది. సినిమా ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కావాల్సి వుంది. లేదూ అంటే దాదాపు 20 కోట్లు బడ్జెట్ తేడా వస్తుందని టాక్ వినిపిస్తోంది. అందువల్ల అవసరం అయితే పాటలు లేకుండా అయినా సినిమా విడుదల చేయాలనే ఆలోచన వున్నట్లు తెలుస్తోంది.
సాహోలాంటి సినిమాకు బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా కీలకం. అందుకే ఇప్పుడు సరైన ఆల్టర్ నేటివ్ కోసం చూస్తున్నారు. బాలీవుడ్ లో కేవలం బ్యాక్ గ్రవుండ్ స్కోర్ చేసే వాళ్లు కొందరు వున్నారు. వారిలో గట్టివారిని తీసుకువచ్చే ఆలోచన ఒకటి వుందని తెలుస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ప్రీతమ్ పేరు కూడా వినిపిస్తోంది.
మొత్తం మీద సాహో సినిమా విధంగా వార్తల్లో ఎక్కువ వినిపించడం కూడా ఓ విధమైన పబ్లిసిటీనే. బాహుబలి తరువాత ప్రభాస్ ను స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా? అన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. అందువల్ల అదే సాహోకు అన్ని విధాలా ప్లస్ పాయింట్.