లింగమనేని.. ఈ పేరు వినగానే విజయవాడ. కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడం, అందులో చంద్రబాబుగారి అధికారిక నివాసం, జనసేనాధిపతి ఆంధ్రలో నివాసం, దాని వైనం ఇలా చాలా చాలా గుర్తుకు వస్తాయి. ఈసారి ఎన్నికల్లో తేదేపా గెలిచివుంటే లింగమనేని హవా మరి కొంతకాలం నడిచి వుండేదని అందరూ లెక్కలు కడతారు. అది కామన్. అలాగే జగన్ వచ్చాడు కాబట్టి లింగమనేని హవా సాగదు ఇక అని కూడా టక్కున చెప్పేస్తారు. అదీ కామన్.
కానీ అసలు విషయం ఒకటి తెలుస్తోంది. లింగమనేని మీద చంద్రబాబు నాయుడు చాలా గరం గరంగా వున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం, పవన్ కళ్యాణ్ కు సలహాలు ఇచ్చి, తెలుగుదేశం పార్టీకి దూరం జరిగేలా చేసింది లింగమనేని అని చంద్రబాబు చాలా కోపంగా వున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ రాజకీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ఇలా వుంది.
తొలిసారి పవన్ మాట మార్చి లోకేష్ మీద, అవినీతి మీద నిప్పులు చెరగడం వెనుక లింగమనేని డైరక్షన్ వుందట. ఆ స్పీచ్ కు ముందురోజే లింగమనేని ఈ మేరకు పొలిటికల్ డైరక్షన్ చేసారని ఆ వర్గాల బోగట్టా. పవన్ స్ట్రాటజీ మార్చాలని, అప్పుడే వర్కవుట్ అవుతుందని, ప్రభుత్వం మీద రివర్స్ లో వెళ్లకపోతే జనంలో స్పందన రాదని లింగమనేని సలహా ఇచ్చినట్లు, దానిని పవన్ పాటించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సంగతి తెలిసి చంద్రబాబు కబురు చేయగా లింగమనేని వెళ్లలేదని, పైగా అన్నీ తాను తరువాత కలిసి వివరంగా చెబుతా అని అన్నారని, రాజకీయ వర్గాల బోగట్టా. అదే సమయంలో చంద్రబాబు కూడా స్ట్రాటజీ మార్చి, పవన్ దూరంగా వున్నా, దగ్గరగానే వున్నారనే వార్తలు పార్టీ వర్గాల ద్వారా బలంగా ప్రచారం చేయించారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
పైగా పవన్ స్పీచ్ లో యాంటీ జగన్, యాంటీ వైకాపా పాయింట్లను మాత్రమే తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్ చేసిందని, దాంతో తేదేపాతో జనసేన అంటకాగినట్లు ప్రచారం జరిగిందని జనసేన వర్గాల బోగట్టా. ఇదంతా జనసేన కీలక నేతలు తెలుగుదేశం నేతల దృష్టికి తీసుకువెళ్లగా, ఈ స్ట్రాటజీనే వర్కవుట్ అవుతుందని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తంమీద పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరం కావడం వెనుక లింగమనేని రాంగ్ గైడెన్స్ వుందని చంద్రబాబు చాలా గరంగరంగా వున్నారని రాజకీయ వర్గాల బోగట్టా. జనసేనతో కలిసి వెళ్లి వుంటే ఇంతటి ఘోర పరాజయం వచ్చి వుండేది కాదని తెలుగుదేశం వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.