ప్రజల అభీష్ట మేరకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు, అను'కుల' మీడియా దృష్టి అంతా జగన్ పాలన మీదే వుంటుంది. ఏ పల్లెటూరిలో ఏ ఒక్కరికి పింఛను రాకున్నా, మర్నాడు పేపర్ లో ఫోటో, ఆపై యాగీ అన్నది కామన్.
వాస్తవానికి ఇప్పుడు జగన్ చేయాల్సిన అసలు పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల కళ్లకు కట్టేలా వివరించడం. అవసరం అయితే ఉండవల్లి లాంటి న్యూట్రల్ పర్సన్ లు, మేథావులతో కమిటీ వేసి, గత అయిదేళ్లలో రాష్ట్రం పరిస్థితి ఎంత చిన్నాభిన్నం చేసారో, అన్నీ క్లియర్ గా నివేదిక తయారుచేయించి, ప్రజల ముందు వుంచాలి.
గత అయిదేళ్లలో జనాలకు ఇష్టం వచ్చినట్ల బాఠానీల మాదిరిగా ఏదో పేరు చెప్పి డబ్బులు పంచేసారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి, ప్రజల ఖాతాలో వేల కోట్లు వేసేసేలా చేసారు. పసుపు కుంకుమ కోసమే వందలకోట్లు అప్పులు చేసేసారు.
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ విభాగాలు అన్నింటి చేత విడివిడిగా అప్పులు చేయించేసారు. అవన్నీ ఇప్పుడు అప్పుల ఊబిలో వున్నాయి. ప్రభుత్వం చూస్తే జూలై ఫస్ట్ కు జీతాలు ఇవ్వడానికి నిధులు వెదుక్కోవాల్సిన పరిస్థితి వుంది.
నవరత్నాల అమలు సంగతి అలావుంచితే, లైన్ లో వున్న పథకాలు ఆగకుండా చూడాల్సి వుంది. తెలుగుదేశం అను'కుల' మీడియాకు ఈ సంగతి తెలుసు. అందుకే వెయిట్ అండ్ సీ పాలసీని తీసుకుంటాయి. జీతాలు లేట్ అయినా, పథకాలు ఆగినా ఓ లెక్కలో జగన్ ను ఆడుకునే ప్రయత్నం చేస్తాయి.
అందువల్ల జగన్ చేయాల్సిన మొదటి పని ఆర్థిక పరిస్థితిని క్లియర్ గా జనాలకు వివరించడమే. ఆ తరువాత చేయాల్సింది వైకాపా జనాలను కట్టడి చేయడం. కనీసం ఇరవై నుంచి నలభై కోట్లు ఖర్చుచేసి వున్నారు గెలిచిన ప్రజా ప్రతినిధుల అంతా. వీరంతా ఆవరు ఆవరు మంటూ వుంటారు. అందువల్ల ఏమాత్రం అవినీతి వాసన తగిలినా చంద్రబాబు కాదు, మన మీడియా ముసుగేసి దాచేయడానికి పావలా అవినీతి వుంటే ఇప్పుడు పది రూపాయల రేంజ్ లో ప్రొజెక్ట్ చేస్తుంది.
అందువల్ల నేతలను చాలా జాగ్రత్తగా కట్టడిచేయాల్సి వుంటుంది. అదే సమయంలో వారి ఇబ్బందులను గమనిస్తూ ముందుకు వెళ్లాలి. నేతల అవినీతితో పాటు అధికారుల అవినీతిపై కూడా దృష్టిపెట్టాలి. తెలుగుదేశం హయాంలో అధికారుల వ్యవహారం కూడా జనాల దృష్టిలో ప్రభుత్వంపై పడింది.
ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అవినీతి విశృంఖలంగా వందన్న టాక్ సర్వత్రా వుంది. అందువల్ల అక్కడ స్మూత్ గా కట్టడి చేయాల్సి వుంది. రెవెన్యూ మంత్రి ఎవరు అయినా, అక్కడ అనేకానేక ఇబ్బందులు తప్పవు. ఇవన్నీ చూసుకుంటూనే నవరత్నాల వ్యవహారం చూడాల్సి వుంది.
ఇవన్నీ స్మూత్ గా జరగాలి అంటే కేంద్రం అండ చాలా అవసరం. అక్కడి నుంచి నిదులు సక్రమంగా వస్తేనే జగన్ గట్టెక్కడం సాధ్యం అవుతుంది. లేదూ అంటే గత అయిదేళ్ల పాపాలు, ప్లస్ ఇప్పటి ఇబ్బందులు అన్నీ కలిసి జగన్ ను కిందకు లాగేసే పని షురూ చేస్తాయి బాబుగారి అను'కుల' మీడియా.