మొన్నటికిమొన్న తన పేరు మీద ఓటీటీ స్థాపించింది. ఇప్పుడు తన పేరు మీద ఓ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసింది నమిత. అటు ఓటీటీ పనులతో పాటు, ఇటు సినీ నిర్మాణ పనుల్ని చూసుకుంటూ తీరక లేకుండా గడుపుతున్నానని చెప్పుకొచ్చింది.
“నమిత ఫిలిం ఫ్యాక్టరీ అనే బ్యానర్ పెట్టాం. ఆ బ్యానర్ పై నా మొదటి సినిమా చేస్తున్నాను. దాని పేరు బౌ..వావ్. కుక్క చుట్టూ తిరిగే సినిమా ఇది. ఇందులో నేనే లీడ్ రోల్ చేశాను. నా తర్వాత స్థానం కుక్కదే. నేను పెద్ద జంతు ప్రేమికురాల్ని. ఈ సినిమా చేయడానికి కారణం ఇదే. 5-6 భాషల్లో దీన్ని రిలీజ్ చేయబోతున్నాం.”
ఇలా తన సొంత బ్యానర్ తో పాటు, దానిపై నిర్మిస్తున్న సినిమా విశేషాల్ని బయటపెట్టింది నమిత. తెలుగు నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయంటున్న ఈ బొద్దుగుమ్మ, అవేంటనేది ప్రస్తుతానికి రివీల్ చేయలేనని చెబుతోంది. త్వరలోనే ఓ తెలుగు-తమిళ సినిమా ప్రకటన వస్తుందని ఊరిస్తోంది.
ఇక ఓటీటీ విశేషాలు చెబుతూ.. నమిత థియేటర్ పేరిట స్థాపించిన ఓటీటీ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ప్రస్తుతానికి 40 నిమిషాల నిడివితో షార్ట్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్ కు పెట్టామని అంటోంది.
కరోనా వల్ల లాంఛింగ్ చేయలేకపోయామని, త్వరలోనే గ్రాండ్ లాంఛ్ ఉంటుందని అంటోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాకు పోటీగా తాము కూడా సినిమాలు కొని స్ట్రీమింగ్ కు పెడతామంటోంది నమిత.