బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా సీత సినిమా తీశాడు దర్శకుడు తేజ. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలున్నారు. తేజ అడిగితే ఓ మోస్తరు హీరోలంతా కాల్షీట్లు ఇస్తారు. కానీ బెల్లంకొండను మాత్రమే తేజ ఎందుకు తీసుకున్నాడు? ఈ ప్రశ్నకు సూటిగా స్పందించాడు తేజ. మరో ఆప్షన్ లేక బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటించాడు. దీనికి కారణం కాజల్ అని కూడా తేల్చిచెప్పేశాడు.
“కథంతా రెడీ చేసుకున్నాను. పొరపాటున ఓసారి కాజల్ కు వినిపించాను. అప్పట్నుంచి పట్టుకుంది నన్ను. ఎప్పటికైనా నేనే చేస్తానని కూర్చుంది. ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని ఇస్తానంది. ఇక అప్పట్నుంచి ఏ హీరోకు కథ చెప్పినా కాజల్ ఫిక్స్ అని చెబుతూ వచ్చాను. చాలామంది డ్రాప్ అయిపోయారు. ఫైనల్ గా బెల్లంకొండ ఒప్పుకున్నాడు. కాజల్ తనకు ఓకే అన్నాడు.”
ఇలా అసలు విషయాన్ని బయటపెట్టాడు తేజ. నిజానికి బెల్లంకొండ స్థానంలో మరో ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లను పరిశీలించాడట ఈ దర్శకుడు. కానీ కాజల్ పేరు చెప్పగానే వాళ్లంతా డ్రాప్ అయ్యారట. దీంతో గత్యంతరం లేక బెల్లంకొండను తీసుకున్నాడట తేజ.
ఈ సినిమాను ఏ హీరోయిన్ చేసినా ఆమె లైఫ్ మారిపోతుందని గట్టి నమ్మకంతో చెబుతున్నాడు తేజ. మూవీ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుందని, అందుకే కాజల్ తనను మరో హీరోయిన్ కు ఈ స్టోరీ వినిపించకుండా చేసిందన్నాడు. తేజ చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఇలాంటి సినిమాను బెల్లంకొండ ఎందుకు ఒప్పుకున్నాడో! అతడికి ఈ ప్రాజెక్టులో ఏం నచ్చిందో?