ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేయడానికి, జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి గోదావరి జిల్లాల్లో రెండు రోజుల పర్యటించిన తర్వాత పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని జనసేన వర్గాలు చెప్పాయి.
ఈ కారణంగా గత ఆదివారం జరగాల్సిన జనవాణిని రద్దు చేస్తున్నట్లుగా నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తర్వాత వారం అంటే ఈ నెల 31వ తేదీన విశాఖలో జనవాణి జరుగుతుందని ప్రకటించారు. కానీ రోజులు గడుస్తున్నా దాని గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. జనసేన పార్టీ పార్టీ నేతలకు కూడా ఎలాంటి సమాచారం పంపలేదు. దీన్ని బట్టి ఈ వారం కూడా జనవాణి లేదని స్పష్టమవుతోంది.
పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగానే వాయిదా వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే మరీ రెండు వారాల పాటు బయటకు రాలేనంత పెద్ద అనారోగ్యం పవన్ కల్యాణ్‌కు వచ్చిందా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్స్ ఎందుకు జనసైనికులకు తెలిసేలా చేయరనేది సస్పెన్స్‌గా మారింది.
పార్టీ ప్రకటించిన కార్యక్రమాలు కూడా నిరంతరాయంగా సాగకపోతే శ్రేణుల్లోనూ నిరుత్సాహం ఏర్పడుతుందని నిరాశపడుతున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితుల్లో.. ప్రజలకు అండగా ఉంటానని నిరూపించాల్సిన పరిస్థితుల్లో బయటకు రాలేకపోవడం జనసైనికుల్ని నిరుత్సాపరుస్తోంది. కనీసం అప్ డేట్ లేకపోవడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది.
జనవాణి 31వ తేదీన ఉంటుందని చెప్పినప్పుడు కనీసం .. ఆరోగ్యం మెరుగుపడకపోవడం వల్ల.. నిర్వహించలేకపోతున్నామన్న సమాచారం కూడా ఎందుకు చెప్పరన్న సందేహాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీలో వ్యవస్థ ఇంకా పూర్తిగా సర్దుకోలేదని బాధపడుతున్నారు.