Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎటాక్ కేసీఆర్‌ : మైలేజీకి అదే మార్గం!

ఎటాక్ కేసీఆర్‌ : మైలేజీకి అదే మార్గం!

కేసీఆర్ అంటేనే మాటల మాంత్రికుడు! మాటలను ఎలా ప్రయోగించాలో.. మాటలతో ఎలా ఎదుటివారిని సమ్మోహితుల్ని చేయాలో.. మాటలతో ఎలా మంటలను పుట్టించాలో.. మాటలతో ఎలా కోటలను కూల్చేయవచ్చో.. రాష్ట్రాలను చీల్చేయవచ్చో.. అవన్నీ కూడా కేసీఆర్ కు తెలిసినంతగా బహుశా వర్తమాన తెలుగు నాయకుల్లో మరొకరికి తెలియకపోవచ్చు. అలాంటి కేసీఆర్.. మరికొన్ని దశాబ్దాల పాటు తనకు తిరుగులేదు అనుకుంటున్న అధికార సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చేయడానికి తాజాగా కమలదళం విశ్వప్రయత్నాలు చేస్తోంది. 

వచ్చే ఏడాది లేదా కాలం కలిసి వస్తే అంతకు ముందుగానే జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయపతాకాన్ని ఎగురవేయాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో బిజెపిలో కీలకనేతలుగా ఎదగడానికి ఉన్ననేతలంతా పోటీ పడుతున్నారు. వారందరికీ కనిపిస్తున్న ఒకే ఒక్క మార్గం.. డైరక్టుగా కేసీఆర్ మీదనే ఎటాక్ చేయడం!

తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పగ్గాలు చేతపట్టిన తర్వాత.. తెలంగాణ బిజెపి రూపురేఖలు మారిపోయాయి. ఆయన దూకుడు.. అదివరకు సారథ్యం వహించిన నేతల్లో లేదు. దాంతో పార్టీలో సహజంగానే వేడి రాజుకుంది. ఆయన దూకుడును కార్యకర్తలు కూడా అందిపుచ్చుకుంటున్నారు. తెరాసతో ఎక్కడ తగాదా వచ్చినా సరే.. అమీతుమీ తేల్చుకోవడమే లక్ష్యం అన్నట్టుగా సాగిపోతున్నారు. బండి సంజయ్ కూడా కేసీఆర్ దీటు అనదగిన తీరులో మాటల్లో రెచ్చిపోతుంటారు. ప్రస్తుతానికి పార్టీ సారధి గనుక.. ఆయనే అగ్రనేత అనుకోవడానికి అవకాశాలు ఎక్కువ. కేసీఆర్ ను మించిన దూకుడు, తెలంగాణ నానుడులతో ముడిపెట్టిన విమర్శలతో మాట్లాడే ఎంపీ అర్వింద్ కూడా ఉన్నారు గానీ.. ఆయన ఎంపీకి మాత్రమే పరిమితమైన నాయకుడిగా వ్యవహరిస్తుంటారు. 

అయితే తాజాగా ఈటల వంటి నాయకులు కూడా కేసీఆర్ మీద డైరక్ట్ ఎటాక్ లను పెంచడం ద్వారా.. తెలంగాణలో పార్టీకి తానే అత్యంత కీలకం అనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ లో కేసీఆర్ మీద పోటీచేస్తానని ప్రకటించడం ద్వారా ఈటల అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటినుంచి.. ఆయన అదే నినాదాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ మీద పోటీచేయడంలో ఒక గొప్ప ఎడ్వాంటేజీ ఉంటుంది. గెలిస్తే జెయింట్ కిల్లర్ గా, సీఎంను ఓడించిన నేతగా, సీఎం పదవిని ఆశించే వ్యక్తిగా ప్రాబబుల్స్ లో ఉండొచ్చు. ఓడిపోతే.. పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తిగా ఏ ఎంపీ పదవినో దక్కించుకుని ఢిల్లీకి వెళ్లొచ్చు. వ్యూహాత్మకంగా ఈటలది మంచి ఎత్తుగడే. కానీ.. ఆయన పార్టీలో బండి సంజయ్ హవాకు థ్రెట్ గా మారారా అనే వాదన కూడా వినిపిస్తోంది. 

ఎవరు ఎక్కడినుంచి పోటీచేయాలనేది పార్టీ మాత్రమే నిర్ణయిస్తుందని.. ఎవరికి వారు తమంతట తాము ప్రకటించుకుంటే అది వారి స్వవిషయమని బండి సంజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఈటలకు కౌంటర్ మాత్రమే. 

కాకపోతే.. ఈటల కూడా తగ్గడం లేదు. కేసీఆర్ మీద మాటల ఎటాక్ ను కొనసాగిస్తున్నారు. తెలంగాణ బిజెపి నాయకుల్లో.. ఈసారి తాము అధికారంలోకి వస్తామనే ఆశ చిగురిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ముఖ్యమంత్రి ప్రాబబుల్స్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి గానీ.. లేదా కీలక పదవుల మీద కన్నేసిన వారు గానీ.. పార్టీలో తమ స్థాయి, స్థానం అప్ గ్రేడ్ చేసుకోవడానికి ప్రస్తుతం ఒకే ఒక్క మార్గం ఎంచుకుంటున్నారు. అదే కేసీఆర్ ను టార్గెట్ చేయడం! డైరక్టుగా కేసీఆర్ మీద మాత్రమే ఎటాక్ చేయడం! 

సాధారణంగా అయితే.. కేసీఆర్ ఇలాంటి వారిని ‘ఇగ్నోర్’ చేయడం ద్వారా.. తాను సుప్రీం అనే సంకేతాలను ప్రజల్లోకి పంపుతుంటారు. కానీ.. ఇటీవలి కాలంలో బిజెపి నాయకులు పెడుతున్న చికాకుకు, విమర్శలకు ఆయన సహనం కోల్పోతున్నారు. ఇదే రకం వ్యూహంతోనే కేసీఆర్ తాను మోడీకి హెచ్చరికలు పంపాలని ప్రయత్నిస్తూ ఉంటే.. బిజెపి రాష్ట్ర నాయకులంతా వారి మాటలతో కేసీఆర్ కు హెచ్చరికలు పంపుతూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వారిలో వారు పైచేయి సాధించుకోడానికి.. కేసీఆర్ అదనంగా అందరికీ టార్గెట్ అయిపోతుండడమే తమాషా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?