క్రికెట్ అనేది టీమ్ గేమ్.. ఎవరో ఒకరు రాణిస్తేనో గెలిచే గేమ్ కాదు క్రికెట్ అంటే. ఎవరో ఒకరు బాగా ఆడటం, విజయం దక్కే స్థాయిలో బ్యాటింగ్ చేయడమో, బౌలింగ్ చేయడమో చేయొచ్చు. మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్లు, అద్భుతమైన ఇన్నింగ్స్ లు, అద్భుతమైన స్పెల్స్ ఉండొచ్చు.. అయితే అవతలి ఎండ్ నుంచి సహకారం లేకపోతే మాత్రం ఒంటి చేత్తో మ్యాచ్ లను గెలిపించే సమస్యే ఉండదు. ఎందుకంటే మొదటే చెప్పినట్టుగా క్రికెట్ అంటే టీమ్ గేమ్!
ఇలాంటి క్రికెట్ లో వరల్డ్ కప్ విజయం అంటే.. ఏ దేశ జట్టుకు అయినా మరపురానిదే. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన ఆ ఆటగాడు అయినా ఒక్కసారి ప్రపంచకప్ ఆడాలని, ప్రపంచ విజేతగా నిలిచే జట్టులో స్థానం ఉండాలని కోరుకుంటాడు. అలా సాధిస్తే వారి కెరీర్ కు జీవన సాఫల్యత లభించినట్టుగా భావిస్తారు. అయితే ఒక్కసారి అలాంటి విజయాన్ని సాధించిన ఆటగాళ్లు హుందాతనాన్ని అలవరుచుకోవాలి. అయితే 2011లో క్రికెట్ ప్రపంచకప్ ను నెగ్గిన ఆటగాళ్లు మాత్రం ఇప్పుడు క్రెడిట్ విషయంలో చేస్తున్న కామెంట్లు చీప్ గా ఉన్నాయి!
వాళ్లంతా దిగ్గజ స్థాయి ఆటగాళ్లే. కెరీర్ లో ఉన్నత శిఖరాలను చూసిన వాళ్లే, ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేకం అనిపించుకున్న వాళ్లే అయితే.. ఇప్పుడు మాత్రం అసహనంతో కాగిపోతున్నారు. నిన్నటితోనో, మొన్నటితోనో ఇండియా క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ను సాధించి 9 సంవత్సరాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్టులు కనిపించాయి. ఈ విషయంలో ముందుగా గంభీర్ రచ్చ రేపాడు.
ఏదో ఒక టీవీ నెట్ వర్క్ వాళ్లు ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ కు సంబంధించిన పిక్చర్ ను పోస్టు చేసి.. శుభాకాంక్షలు తెలిపారట. దీంతో గంభీర్ కు కోపం వచ్చింది. భారతీయులు ఎవరూ ఆ సిక్స్ ను మరిచిపోలేరు. అయితే ఆ సిక్స్ మాత్రమే ఇండియాను గెలిపించలేదంటూ..గంభీర్ రెచ్చిపోయాడు.
ఏదో ఒక మీడియా హౌస్ వాళ్లు పోస్టు చేసిన దానికి గంభీర్ అంత బాధపడిపోవడం దేనికి? ఆ మ్యాచ్ ను చూసిన వాళ్లకు ధోనీ సిక్సర్ ఎంతగా గుర్తుంటుందో.. గంభీర్ ఆడిన విలువైన ఇన్నింగ్స్ కూడా గుర్తుంటుంది. అయితే ధోనీ సిక్సర్ హైలెట్ అవుతుండే సరికి గంభీర్ కు అసహనం పుట్టినట్టుగా ఉంది.
ఇక యువరాజ్ కూడా మరో రచ్చ రేపాడు. అది రవిశాస్త్రి ట్వీట్ విషయంలో. ప్రస్తుత టీమిండియా కోచ్ అయిన శాస్త్రి.. 2011 ప్రపంచకప్ విజయాన్ని ట్వీట్ చేస్తూ సచిన్, కొహ్లీల ట్విటర్ ఖాతాలను ట్యాగ్ చేశాడు. దీనిపై యువీ సెటైరిక్ గా స్పందించాడు. తన, ధోనీ ట్విటర్ ఖాతాలను కూడా ట్యాగ్ చేయాల్సిందంటూ శాస్త్రికి పంచ్ ఇచ్చాడు యువీ.
కొహ్లీ దయ మీద కోచ్ గా కొనసాగుతున్నాడు శాస్త్రి, ఇక ఈ ముంబైకర్ కు సచిన్ అంటే భయభక్తులు ఉండవచ్చు. కాబట్టి.. వారిని ట్యాగ్ చేసి ఉంటాడు. అలా శాస్త్రి తన సంకుచిత స్వభావాన్ని చాటుకున్నాడు. దాన్ని అంతటితో వదిలేయక యువరాజ్ కూడా కెళికాడు.
అయితే యువీ ట్వీట్ లోనూ తప్పు ఉంది. సచిన్, కొహ్లీ, యువీ, మహీల వల్ల మాత్రమే ఇండియా ప్రపంచ విజేతగా నిలవలేదు. ఆ వరల్డ్ కప్ ఆడిన 15 మంది ఆటగాళ్ల, సపోర్టింగ్ స్టాఫ్.. అందరి సహకారం ఉంటుంది. వాళ్లందరినీ ట్యాగ్ చేయమని యువీ అడగాల్సింది.
అయితే ఏతావాతా అర్థం అవుతున్నది ఏమిటంటే.. డబ్బు, అహంతో కళ్లు మూసుకుపోయిన భారత తాజా, మాజీ క్రికెటర్లు తమ అసహనాన్ని, లేకితనాన్ని చాటుకోవడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒక్కసారి 1983 ప్రపంచకప్ విజయంలో భాగస్వామ్యులు అయిన ఆటగాళ్లను కదిలించి చూడండి, ఇప్పటికీ వారు తమ సహచరుల ఇన్నింగ్స్ ల గురించినే మాట్లాడతారు. కపిల్ డెవిల్స్ లో ప్రతి ఒక్కరూ తమ సహచరుల గొప్పదనం గురించినే మాట్లాడతారు. అందుకు సంబంధించి సినిమా వస్తోంది.
దానిపై కపిల్ ఇటీవల స్పందిస్తూ.. ఆ సినిమాలో తనను హైలెట్ చేయకపోతే సంతోషం అని, తమది టీమ్ అని, టీమ్ ఇండియానే అప్పుడు విజేత అని కపిల్ వివరించాడు. కపిల్ మాత్రమే కాదు.. నాటి ఆటగాళ్లు చాలా హుందాగా నాటి విజయం గురించి మాట్లాడతారు. 2011 విజయంలో భాగస్వామ్యులు అయిన ఆటగాళ్లలో మాత్రం ఆ హుందాతనం కనిపించడం లేదు. టీమ్ వర్క్ అంటే.. Less 'me' MORE 'we'!